యూకే రాజకీయాలలో ఆసియన్లదే కీలకపాత్ర: స్వరాజ్ పాల్

Swaraj Paul
Ganesh|
PTI
బ్రిటన్ రాజకీయాలలో ఆసియా సంతతి ప్రజానీకానిదే కీలకమైన పాత్ర అని లేబర్ పార్టీ ఎంపీ మరియు భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త లార్డ్ స్వరాజ్ పాల్ వ్యాఖ్యానించారు. యూకే రాజకీయాలలో అతి ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశం ఆసియా సంతతి ప్రజలకు వచ్చిందనీ, ఇందుకు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే సాక్ష్యంగా చెప్పవచ్చని ఆయన అన్నారు.

కాగా.. ఇటీవల బ్రిటన్‌ పార్లమెంటుకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆసియా సంతతి ప్రజానీకానికి చెందిన చాలామంది అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకేకి చెందిన ఉమెన్ ఇండియా అసోసియేషన్ (డబ్ల్యూఐఏ)కు చెందిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్వరాజ్ పాల్ బ్రిటన్‌కు ఎంతగానో సేవచేశామనీ, దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ దేశ పార్లమెంటులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆసియావాసుల ప్రాతినిధ్యం ఉండబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పాల్ పేర్కొన్నారు

ఇదిలా ఉంటే.. బ్రిటన్ ఎన్నికల ఫలితాలలో ఓటర్లే నిజమైన విజేతలంటూ.. విదేశీ వ్యాపారాలకు బ్రిటన్ తరపున అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న స్వరాజ్ పాల్ ఈ సందర్భంగా అన్నారు. వివిధ దేశాల, జాతులకు చెందినవారికి బ్రిటన్ రాజకీయ పార్టీలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నందున.. రాజకీయాలలో రాణించేందుకు ఇదే చక్కని అవకాశమని చెప్పారు.

ఇదే సందర్భంగా భారత మహిళ అసోసియేషన్ సభ్యులను ఉద్దేశించి స్వరాజ్ పాల్ మాట్లాడుతూ.. యూకేలో ఆసియా మహిళలు సామాజికంగా, రాజకీయంగా ఉన్నతమైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కాగా.. ఇటీవలనే ఒక కన్నును పోగొట్టుకున్న స్వరాజ్ పాల్ సతీమణి అరుణా పాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం గమనార్హం.


దీనిపై మరింత చదవండి :