రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం

Ganesh|
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌‌‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందగా.. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఒహయో రాష్ట్రంలోని డేటస్ పట్టణంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో హైదరాబాదు నగరవాసి అయిన నరేష్ దాసా (22) దుర్మరణం పాలయ్యాడు. కాగా.. మరో విద్యార్థి వరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు.

కాగా... రైట్ స్టేట్ యూనివర్సిటీలో ఎం.ఎస్. ప్రథమ సంవత్సరం చదువుతున్న నరేష్, వరుణ్‌లిద్దరూ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొనటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వరుణ్‌ను ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయమై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు కోమటి జయరాం మాట్లాడుతూ... నరేష్ మృతదేహాన్ని అతడి స్వస్థలానికి తరలించేందుకు తాము అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదం గురించి నరేష్ తల్లిదండ్రులకు కూడా సమాచారం చేరవేసినట్లు ఆయన తెలిపారు.

మంచి భవిష్యత్ ఉన్న నరేష్ ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమని, అతడి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేస్తున్నానని జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. నల్గొండ జిల్లా భువనగిరిలోని ఆరోరా కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన నరేష్ ఈ సంవత్సరం జనవరిలో.. ఎం.ఎస్ విద్య నభ్యసించేందుకుగానూ రైట్ స్టేట్ యూనివర్సిటీలో చేరాడు.


దీనిపై మరింత చదవండి :