లండన్‌లో వైభవంగా దసరా ఉత్సవాలు

Durga
Ganesh|
FILE
పరాయి దేశాల్లో ఉంటున్నా భారతీయ పండుగలను మరచి పోకుండా, భక్తిశ్రద్ధలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ దుర్గా నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు లండన్ నగరంలోని పలు వీధులలో ప్రవాస భారతీయులు దుర్గామాత మండపాలను నిర్మించి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు.

ఈ మండపాలకు భారీ సంఖ్యలో ఎన్నారైలు హాజరై, అమ్మవారిని దర్శించుకుని, విశేష పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలను స్వీకరించారు. వాయువ్య లండన్‌లోని వింబ్‌లేలో నిర్మల్ ముఖర్జీ కుటుంబం నిర్వహిస్తున్న దుర్గాపూజకు విశేష ఆదరణ లభిస్తోంది. ముఖర్జీ కుటుంబం గత 30 సంవత్సరాలుగా దసరా వేడుకలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.

ముఖర్జీ కుటుంబం నిర్వహించే ఈ నవరాత్రి వేడుకలకు లండన్‌వ్యాప్తంగా మంచి పేరుంది. ఈ పూజలకుగానూ ప్రతిరోజూ 4వేల మంది భక్తులు హాజరయ్యారు. ఇక్కడ భారతీయ, బెంగాలీల వంటకాలతో కూడిన ఉచిత భోజనాలను సైతం భక్తులకు అందజేయటం విశేషంగా చెప్పవచ్చు.

లండన్ నగరంలో దాదాపు 20 దుర్గామాత మండపాలుండగా.. వీటిలో ప్రతిరోజూ అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ఈ నగరంలోని ప్రముఖ ఎన్నారైలు దసరా ఉత్సవాలకుగానూ ఉదారంగా విరాళాలు సమకూర్చటంతో.. వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.


దీనిపై మరింత చదవండి :