విక్టోరియన్ ప్రీమియర్ ముంబై పర్యటన రద్దు

Ganesh|
ఈ వారంలో భారత్ పర్యటించనున్న విక్టోరియన్ ప్రీమియర్ జాన్ బ్రుమ్‌బీ... ముంబై నగరాన్ని పర్యటించబోరని మీడియా కథనం ఒకటి వెల్లడించింది. ముంబై నగరంలో టెర్రరిస్టు దాడులు జరిగే అవకాశం ఉండవచ్చని ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ సూచనల మేరకు ఆయన ముంబై పర్యటనను రద్దు చేసుకున్నట్లు స్కై న్యూస్ టీవీ ఛానెల్ వెల్లడించింది.

దీంతో బ్రుమ్‌బీ బుధ, గురువారాలు న్యూఢిల్లీలోనే గడుపనున్నారని స్కై న్యూస్ పేర్కొంది. చివరి నిమిషంలో విదేశీ వ్యవహారాల శాఖ ఇచ్చిన సలహా మేరకే ఆయన ముంబై పర్యటనను మానుకున్నారు.

సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో భారత్ పర్యటించనున్న విదేశీ టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని మళ్లీ ముంబై నగరంలో దాడులకు తెగబడనున్నారని విదేశీ వ్యవహారాల శాఖకు గత వారంలో అందిన సమాచారం మేరకే విక్టోరియన్ ప్రీమియర్ పర్యటనను స్వల్పంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... విక్టోరియన్ ప్రీమియర్ భారత్ పర్యటనలో ఆయనతోపాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ జూలియా గిల్లార్డ్ కూడా రానున్నారు. భారత్-ఆస్ట్రేలియాల మధ్య దౌత్యపర సంబంధాలు, ముఖ్యంగా ప్రస్తుతం ఆసీస్‌లో నెలకొన్న జాతివివక్ష దాడులు, విద్యార్థుల రక్షణ... తదితర అంశాలు వీరి పర్యటనలో విస్తృతంగా చర్చించేందుకు అవకాశం ఉంది.


దీనిపై మరింత చదవండి :