విద్యార్థుల ప్రతిభకు అద్దంపట్టిన అంతర్జాతీయ ఆర్ట్ క్యాంపు

PNR|
File
FILE
తిరువళ్లూరు జిల్లా పాక్కం సమీపంలోని కసువా గ్రామంలో సేవాలయ (రిజిస్టర్డ్ ఛారిటబుల్ ట్రస్ట్)లో విద్యార్థుల ప్రతిభకు అద్దంపట్టేలా అంతర్జాతీయ ఆర్ట్ క్యాంపును ఇటీవల నిర్వహించారు. అమెరికా, కాలిఫోర్నియాలోని చిల్డ్రన్స్ ఆర్ట్ విలేజ్, చెన్నయ్‌కు చెందిన ఆధి ఆర్ట్స్ అకాడెమీలు సంయుక్తంగా ఈ క్యాంపును నిర్వహించాయి.

గత 24వ తేదీన ఈ క్యాంపు ప్రారంభంకాగా, తమిళ చిత్ర దర్శకుడు వసంత్ ఈ క్యాంపును ప్రారంభించారు. ముగింపు వేడుకలు మే 29వ తేదీన జరిగాయి. ఈ వేడుకలకు తిరువళ్లూరు జిల్లా విద్యాధికారి ఎన్.కళ్యాణ సుందరం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారం రోజుల పాటు సాగిన ఆర్ట్ క్యాంపులో సేవాలయకు చెందిన పలువురు విద్యార్థులు తమలోని సృజనాత్మకు అద్దం పట్టేలా ఆర్ట్స్ క్యాంపులో పాల్గొన్నారు.

ఇందులో కాలిఫోర్నియాకు చెందిన చిల్డ్రన్స్ ఆర్ట్ విలేజ్‌ ప్రతినిధులు మైలై, బాబ్ బ్రీచ్, మైఖేల్ కుమ్మింగ్స్, ఎరిన్ పోలై, నికోలస్ ప్రాట్లీ, జస్సికా రిచ్‌లాండ్‌లు పాల్గొన్నారు. సినీ రంగ నేపథ్యం కలిగిన బాబ్ బ్రీచ్, మైలైలు వెబ్‌దునియా ప్రతినిధులతో మాట్లాడుతూ చిన్నారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు తమ సంస్థ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు.

కేవలం ఆర్థిక స్థోమతలేని ప్రతిభావంతులైన చిన్నారులను గుర్తించి, వారిని ప్రోత్సహించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. తమ బృందంలో ఏడుగురు సభ్యులు ఉన్నట్టు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థను తాము నడుపుతున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఒక్కో సభ్యుడు 4000 అమెరికా డాలర్లను విరాళంగా అందజేసి కొంత మొత్తాన్ని సేకరిస్తున్నట్టు చెప్పారు. వీటితో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వారు వెల్లడించారు.

ఇలాంటి తరహా కార్యక్రమాలను ఇప్పటికే బులీవియా, భారత్‌లలో నిర్వహిస్తున్నామన్నారు. తమ సంస్థకు చెందిన విద్యార్థులు ఈ యేడాది ఆఖరుకు రెండు వేలకు చేరుతారని చెప్పారు. వీరిలో 650 మంది గానాకు చెందిన వారు కాగా, మిగిలిన వారు భారత్‌కు చెందినవారిగా వివరించారు.

తమ ఆర్ట్ క్యాంపులో భాగంగా, కలర్‌ఫుల్ ఐడియాలు, ప్రకృతి అందాలను అవగాహన చేసుకుని, తమలోని భావాలను కళాత్మకంగా వ్యక్తీకరించగలిగే విద్యార్థులను గుర్తించి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నట్టు వారు వెల్లడించారు. ఇందుకోసం 21 సంవత్సరాల లోపు విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు.

అయితే, గతయేడాది నిర్వహించిన క్యాంపు కంటే ఈ దఫా నిర్వహించిన క్యాంపు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అదేసమయంలో విద్యార్థులు తమ మనస్సులోని భావాలను వ్యక్తీకరించేందుకు భాష ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. అయినప్పటికీ.. వారిని హావభావాలను అర్థం చేసుకుని వారిని ప్రోత్సహిస్తున్నట్టు బాబ్ బ్రీచ్ వెల్లడించారు. ఈ క్యాంపు ప్రధానోద్దేశం.. భారతీయ సంస్కృతీ, కళలు, ప్రతిభను గుర్తించి, విదేశాలకు ఎగుమతి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం తమ సంస్థ అహర్నిశలు కృషి చేస్తున్నట్టు వారు తెలిపారు.

ఇదిలావుండగా, 19888 సంవత్సరంలో అంటే 21 సంవత్సరాల క్రితం సేవాలయా అనే స్వచ్చంద సంస్థను మురళీధరన్ అనే వ్యక్తి స్థాపించారు. తిరువళ్లూరు జిల్లా పాక్కం సమీపంలోని కసువా అనే చిన్న గ్రామంలో చిన్నపాటి ఇంటిని అద్దెకు తీసుకుని ఐదుగురు విద్యార్థులతో ఈ సంస్థను స్థాపించారు. 21 సంవత్సరాల తర్వాత అంటే ఇపుడు చూస్తే.. ఈ సేవాలయలో 12వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసే సౌకర్యం ఉంది.

ఇందులో సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరితో పాటు మరో 150 మందికిపైగా అనాధ పిల్లలు ఇక్కడే నివశిస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఒక గోశాలను కూడా నడుపుతున్నట్టు చెప్పారు. పాఠశాల ఆవరణలోనే లైబ్రరీ, లేబొరేటరీ, విద్యార్థినులకు ఉచితంగా బోధించే టైలరింగ్ షాపుతో పాటు కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర శిక్షణలు ఇస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :