సిక్కు ఎన్నారై రాజీందర్‌ సింగ్‌ "బీఎన్‌పీ" తీర్థం..!

Nri Man
Ganesh|
FILE
బ్రిటీష్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) వివాదాస్పద సూత్రాలను సమర్థించిన ప్రవాస సిక్కు జాతీయుడు రాజీందర్ సింగ్‌కు ఆ పార్టీ తీర్థం లభించనుంది. దీంతో బీఎన్‌పీలో చేరిన తొలి శ్వేతజాతీయేతరుడిగా రాజీందర్ రికార్డు సృష్టించనున్నారు. బ్రిటన్‌లో జాత్యహంకార పార్టీగా ముద్రపడిన బీఎన్‌పీ స్థాపించిన రోజునుంచీ.. దాంట్లో శ్వేతజాతీయులే సభ్యులుగా ఉన్నారు. అయితే.. సంవత్సరాల తరబడీ కొనసాగుతున్న ఈ పద్ధతికి రాజీందర్ చెక్ పెట్టినట్లయ్యంది.

ఇటీవలి కాలంలో బీఎన్‌పీపై విమర్శలు తారా స్థాయికి చేరుకోవటంతోపాటు.. సెప్టెంబర్‌లో మానవ హక్కుల కమీషన్ చట్టపరమైన చర్యలు తీసుకున్న కారణంగా, ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు నిక్ గ్రిఫిన్ తమ సిద్ధాంతాలను పునఃసమీక్షించుకునే పనిలో పడ్డారు. పైగా.. గోధుమ వర్ణ జాతీయులకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించుకోవాల్సి పరిస్థితి వారికి దాపురించింది.

ఈ నేపథ్యంలో బీఎన్‌పీ సిద్ధాంతాలను బహిరంగంగా సమర్థించిన ఆసియా సంతతి వ్యక్తి రాజీందర్ సింగ్‌ను పార్టీలో చేర్చుకుని, తమపై ఉన్న మచ్చను తొలగించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరోవైపు రాజీందర్ సింగ్ మాట్లాడుతూ.. బీఎన్‌పీ జాతి వివక్షను పక్కనబెట్టి, ఆ పార్టీకి దీర్ఘకాలంగా మద్ధతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

బీఎన్‌పీలో చేరటాన్ని గౌరవంగా భావిస్తున్నాననీ... ముస్లిం అనే పదాన్ని బాహాటంగా ప్రకటించగల సత్తా కేవలం ఆ పార్టీకే ఉందని రాజీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్‌లోని పంజాబ్ ప్రాంతం నుంచి 1967 వలస వచ్చిన సింగ్.. తనకు ముస్లింలంటే ద్వేషం లేదనీ, సిక్కు మత విశ్వాసాల ప్రకారం శత్రువును కూడా ప్రేమించాలని చెప్పారు. కాగా.. ఈ వార్తా కథనాన్ని బ్రిటీష్ డైలీ ప్రచురితమయ్యంది.


దీనిపై మరింత చదవండి :