సిడ్నీ, మెల్‌బోర్న్‌లు సురక్షితం కాదు : సర్వే

Nri news
Ganesh|
FILE
ఆస్ట్రేలియాలోని ముఖ్యమైన నగరాలైన సిడ్నీ, మెల్‌బోర్న్‌లు విదేశీ విద్యార్థులకు ఏ మాత్రం సురక్షితం కాదని తాజా సర్వే ఒకటి తేల్చి చెప్పింది. ఈ రెండు నగరాలలో నివసిస్తున్న 6 వేల మంది విదేశీ విద్యార్థులు పాల్గొన్న తాజా సర్వేలో.. సిడ్నీ, మెల్‌బోర్న్‌లు ఏ మాత్రం స్నేహపూరితం కాని, ప్రమాదకరమైన ప్రాంతాలుగా తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు.

భారతీయ విద్యార్థులపై జరిగిన అనేక జాత్యహంకార దాడులకు కూడా ఈ సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాలే వేదికలుగా నిలవటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని.. ఏఏపీ రిపోర్టు వ్యాఖ్యానించింది. ఈ సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో ఇద్దరు మాత్రం ఈ రెండు నగరాలను అత్యంత ప్రమాదకరమైనవిగా తాము భావిస్తున్నామని చెప్పటం గమనార్హం.

అలాగే.. పెర్త్, బ్రిస్బేన్ మరియు అడిలైడ్ నగరాలు ఏ మాత్రం స్నేహపూరితం కాని ప్రాంతాలుగా.. అక్కడ నివసించేందుకు కాస్త ఆలోచించాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అయితే ఇవేమీ ప్రమాదకర నగరాలు మాత్రం కావన్నారు.

ఇదిలా ఉంటే.. చదువుకునేందుకు అన్ని దేశాల కంటే ఆస్ట్రేలియానే సురక్షిత ప్రాంతమని 26 శాతం మంది భారతీయ విద్యార్థులు మరో సర్వేలో వెల్లడించారు. ఆస్ట్రేలియా తరువాత బ్రిటన్, కెనడాలు భద్రతాపరంగా మంచివని 20 శాతం విద్యార్థులు తెలిపారు. అమెరికాకు కేవలం 5 శాతం ఓటేయగా.. న్యూజిలాండ్ కూడా ఫర్వాలేదని మరికొంతమంది విద్యార్థులు అన్నారు.

కాగా... మెజారిటీ విద్యార్థులు ఆస్ట్రేలియాకే ఓటేయటం తమకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని ఐడీపీ ఎడ్యుకేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ పోలక్ పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల భద్రతకు సరైన, పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న దేశాలలో కూడా ఆస్ట్రేలియా 19 శాతంతో మొదటి స్థానంలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. సిడ్నీలో ఈ వారంలో జరిగే ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్పరెన్స్‌లో తమ సర్వే నివేదికను విడుదల చేయనున్నామన్నారు.


దీనిపై మరింత చదవండి :