స్వైన్ ఫ్లూ మహమ్మారికి ఎన్నారై బలి

Ganesh|
FILE
భారత్‌లో రోజు రోజుకు విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్ మహమ్మారికి... ఓ ప్రవాస భారతీయుడు బలయ్యాడు. అమెరికాలోని అట్లాంటా నుంచి పది రోజుల క్రిందట భారత్ వచ్చిన ప్రవీణ్ పటేల్ (43) అనే ఎన్నారై.. ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సివిల్ హాస్పిటల్‌లో మరణించారు.

కాగా... ఆగస్టు నెల మూడవ తేదీన మహారాష్ట్రలోని పుణే నగరంలో రీదా షేక్ అనే 14 ఏళ్ల బాలిక స్వైన్ ఫ్లూ‌ దెబ్బకు బలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత గత శనివారం రోజున పుణేలోనే సంజయ్ తుకారాం కోక్రే (42) అనే ఉపాధ్యాయుడు, ముంబైలో నివసిస్తున్న ఫాహమిదా పాన్‌వాలా (53) అనే షుగర్ వ్యాధిగ్రస్తుడు కూడా స్వైన్ ఫ్లూ మహమ్మారికి బలయ్యారు.

ఆయా రాష్ట్రాలలో పదుల సంఖ్యలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవుతుండగా... ఈ వ్యాధి వల్ల మరణించిన వారిసంఖ్య ప్రస్తుతం మన దేశంలో నాలుగుకు చేరింది. తాజాగా మరో 82 కేసులు నమోదు అవటంతో.. పాజిటివ్‌ల సంఖ్య 864కు చేరిందని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే... మహారాష్ట్రలోనే మరో ముగ్గురు స్వైన్ ఫ్లూ రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో, స్వైన్ ఫ్లూ తీవ్రంగా వ్యాపిస్తుడంటంతో ముందు జాగ్రత్త చర్యగా పుణే, పింప్రీలలో అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలను వారం రోజులపాటు మూసి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ముంబై, నవీ ముంబైలలో కూడా పాఠశాలలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించారు.

మరోవైపు... స్వైన్ ఫ్లూ దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాలు తమ వైద్య యంత్రాంగాలను అప్రమత్తం చేశాయి. అత్యవసరం లేనిదే మహారాష్ట్రకు ప్రయాణించరాదని తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలకు సూచన చేసింది. అలాగే రైల్వేస్టేషన్లలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే, ప్రయాణీకులను పరీక్షించిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తోంది.


దీనిపై మరింత చదవండి :