హిందువులకు సారీ చెప్పిన "బర్గర్ కింగ్"

FILE
తమ కంపెనీ ఉత్పత్తులపై హిందూ దేవతలను కించపరిచే విధంగా వ్యాపార ప్రకటనను ముద్రించిన బర్గర్ కింగ్ కార్పోరేషన్ (బీకేసీ) సంస్థ ప్రపంచంలోని హిందువులందరికీ క్షమాపణలు తెలియజేసింది. జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నామని, ఎవరినీ కించపరచాలన్న దురుద్దేశం తమకు లేదని ఆ సంస్థ ప్రకటించింది.

ఈ విషయమై బర్గర్ కింగ్ ప్రతినిధి డెనీస్ టి విల్సన్... తమ సంస్థ విలువలు పాటించటంలో ముందుంటుందనీ, అతిథులతోపాటు అన్నిమతాల పట్ల తమకు ఎనలేని గౌరవం ఉందని ఈ-మెయిల్ ద్వారా పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. స్పెయిన్‌లో ముద్రించిన ఈ ప్రకటన స్థానికులను ఆకట్టుకునేందుకు మాత్రమే ఉద్దేశించినదని ఆయన వివరణ ఇచ్చారు.

అంతేగానీ, ఏ మతాన్ని అవమానించాలన్న దురుద్దేశం తమకు ఎంతమాత్రం లేదని విల్సన్ పై ఈ-మెయిల్‌లో వివరించారు. హిందూ అమెరికా ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) చేసిన డిమాండ్‌తో ఈ ప్రకటనను వెనువెంటనే ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు.

Ganesh|
ఇదిలా ఉంటే.. 70 దేశాలలో ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లను నడుపుతున్న బీకేసీ సంస్థ, తాజాగా... మాంసంతో తయారు చేసిన శాండ్‌విచ్‌పై హిందూ దేవత లక్ష్మీదేవి కూర్చున్నట్లుగా ప్రకటనను ముద్రించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా హిందువుల నుంచి నిరసన ఎదుర్కొన్న బీకేసీ... ఎట్టకేలకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించింది.


దీనిపై మరింత చదవండి :