"హెచ్1బీ" వీసాలపై భారత ఐటీ కంపెనీల వెనుకడుగు

Nri News
Hanumantha Reddy|
FILE
ప్రపంచమంతటా నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అత్యంత క్రేజ్ కలిగిన అమెరికా హెచ్1బీ వీసాలను పొందేందుకు భారతీయ ఐటీ కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయి. ఈ సంవత్సరం దేశంలో ప్రధాన ఐటీ కంపెనీలు పొందిన హెచ్1బీ వీసాల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించటమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొనవచ్చు. మాంద్యం కారణంగా అమెరికా మార్కెట్‌లో అవకాశాలు తగ్గిన కారణంగా భారతీయ కంపెనీలు ఈ వీసాలపై వెనక్కి తగ్గాయి.

అమెరికా పౌర, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. సాఫ్ట్‌వేర్ ధిగ్గజం ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరంలో 4,559 వీసాలను సంపాదించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ 2008-2009 ఆర్థిక సంవత్సరంలో కేవలం 440 వీసాలను మాత్రమే ఇన్ఫోసిస్ పొందటం గమనార్హం. అదే విధంగా విప్రో గత సంవత్సరం 2,678, ఈ ఏడాది1,964 వీసాలను దక్కించుకుంది.

కాగా... ఇన్ఫోసిస్ 4,559, విప్రో 2,678, సత్యం 1,917, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1,539, మైక్రోసాఫ్ట్ 1,037 వీసాలతో అత్యధిక హెచ్1బీ వీసాలు పొందిన భారతీయ కంపెనీల్లో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.

విప్రో తరువాత ఇంటెల్ 723, ఐబీఎం ఇండియా 695, పాట్నీ అమెరికన్స్ 609 వీసాలతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే.. పై కంపెనీలలో సత్యం పరిస్థితి పూర్తి భిన్నమైందనే చెప్పవచ్చు. గత సంవత్సరం 1,917 వీసాలు పొందిన ఆ సంస్థ ఇప్పుడు కేవలం 219కి పరిమితమయ్యింది. కాగా.. ఉద్యోగాల్లో కోత విధిస్తున్నప్పటికీ అమెరికా ఐటీ కంపెనీలు మాత్రం హెచ్1బీ వీసాలపై మక్కువ చూపిస్తూనే ఉన్నారని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది.


దీనిపై మరింత చదవండి :