లండన్‌లో జాతి వివక్షకు ఎన్నారై వృద్ధుడు బలి...!

NRI
Ganesh|
FILE
జాత్యహంకార దాడికి గురై గత వారం రోజులుగా చావు బ్రతుకులు మధ్య కొట్టు మిట్టాడుతున్న భారత సంతతి వృద్ధుడు ఎక్రముల్ హక్ (67) సోమవారంనాడు మరణించారు. లండన్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్లు స్కాట్లాండ్ పోలీసులు మీడియాకు వెల్లడించారు.

కాగా.. హక్ గత నెల 31వ తేదీన దక్షిణ లండన్‌లోని ఓ మసీదు నుంచి తన ఐదు సంవత్సరాల మనవరాలితో తిరిగి వస్తుండగా, టూంటింగ్ ప్రాంతంలో కొందరు పాఠశాల విద్యార్థులు ఆయనను విచక్షణా రహితంగా కొట్టినట్లు పోలీసులు తెలియజేశారు. ఈ కేసును జాతి వివక్షకు సంబంధించిన హత్యగా భావించి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

ఆకతాయి విద్యార్థుల ముఠా హక్‌తో పాటు మరో 40 సంవత్సరాల వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, హక్‌పై దాడికి పాల్పడ్డ విద్యార్థుల్లో ఇప్పటిదాకా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామనీ, వారిని సుటాన్ కోర్టులో ప్రవేశపెట్టనున్నామని వారు తెలియజేశారు.

ఇదిలా ఉంటే... కోల్‌కతాకు చెందిన హక్ 1972వ సంవత్సరంలో ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌కు వెళ్లారు. అనంతరం తన భార్యతో కలిసి 1980వ దశకంలో లండన్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.


దీనిపై మరింత చదవండి :