ఎన్నారై మహిళపై జాతి వివక్ష ఆరోపణలు

Nri women
Ganesh|
FILE
దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఓ మహిళా బ్యూటీయన్ జాతి వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాను నడిపే మసాజ్ సెంటర్‌లో నల్ల జాతీయులకు చికిత్స చేయనని చెప్పడంతో ఆమెపై అక్కడి సమానత్వ కోర్టులో కేసు నమోదైంది.

వివరాల్లోకి వస్తే.. నల్లజాతికి చెందిన బిజినెస్ డెవలపర్ సోఫీ క్రౌజ్, తన కూతురుతో కలిసి ఎన్నారై మహిళ నడుపుతున్న మసాజ్ సెంటర్‌కు వచ్చారు. అయితే ఆమె వారికి చికిత్స అందించేందుకు నిరాకరించారు. దీంతో క్రౌజ్ బెల్లైర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటమేగాక, అక్కడి సమానత్వ కోర్టును సైతం ఆశ్రయించారు. కాగా... సదరు ఎన్నారై మహిళ పేరు మాత్రం వెల్లడి కాలేదు.

ఇదిలా ఉంటే.. తన ఇంటివద్ద లభించిన మసాజ్ సెంటర్ బ్రోచర్ ఆధారంగానే తాను ఆ కేంద్రానికి వెళ్లానని క్రౌజ్ తెలిపారు. ముందుగా నల్లజాతీయుల వెంట్రుకలకు మసాజ్ చేయడం ఇబ్బందితో కూడిన వ్యవహారమని చెప్పిన ఆ ఎన్నారై మహిళ.. ప్యాకేజీ వివరాలను వెల్లడించేందుకు తిరస్కరించటమేగాక, నల్లజాతీయులకు తాను చికిత్స చేయనని తేల్చిచెప్పిందని క్రౌజ్ వివరించారు.

దీంతో తాను పోలీస్ స్టేషన్‌ను, కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని క్రౌజ్ చెప్పారు. నిందితురాలికి తన తప్పును తెలియజేయటంతోపాటు, జాతి వివక్షను సహించబోమని చెప్పటం కోసమే ఈ కేసును వేశానన్నారు. ఈ సంగతలా ఉంటే... కొన్ని సంవత్సరాల క్రితం నల్లజాతీయుడికి క్షవరం చేసేందుకు తిరస్కరించిన ఓ భారత సంతతి క్షురకుడి వ్యవహారం ఆ దేశ పతాక శీర్షికలను ఆక్రమించింది. ఆ తరువాత అతను బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం కాస్తా సద్దుమణిగింది.


దీనిపై మరింత చదవండి :