ప్రభుత్వాన్ని మోసగించి సుమారు లక్ష పౌండ్ల సహాయాన్ని పొందారన్న నేరారోపణతో భారత సంతతికి చెందిన మహిళ ఒకరు తన భాగస్వామితో కలిసి బ్రిటన్లో విచారణ ఎదుర్కొంటున్నారు. శశి బచెతా అనే 52 సంవత్సరాల మహిళ, ఆమె భాగస్వామి జెఫ్రీ కోల్స్ (58)లు ఈ మోసానికి పాల్పడినట్లు లండన్ ప్రభుత్వం వెల్లడించింది. 2002-08 సంవత్సరాల మధ్య కాలంలో శశి, జెఫ్రీలు పై అక్రమాలకు పాల్పడ్డారంటూ... గత సంవత్సరం జనవరి నెలలో బ్రిటన్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ కేసులో వీరిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం జైలుశిక్షపై తీర్పును వాయిదా వేసింది. కాగా, వీరిరువురికీ మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉండగా, ప్రస్తుతం నిందితులు బెయిల్పై విడుదలయినట్లు ఆ దేశ వర్గాలు ఉటంకించాయి.