నిషేధిత వైద్యుడి చేతిలో ఎన్నారై మహిళ మృతి

Ganesh|
భారత సంతతికి చెందిన సత్వంత్ వొహ్రా (55) అనే మహిళ.. నిషేధిత వైద్యుడు చిన్హ్ గుయెన్ (43) చేసిన ఆపరేషన్ వికటించి ప్రాణాలు కోల్పోయింది. హెర్ట్‌ఫోడ్‌షైర్‌లోని వెల్విన్ ప్రాంతానికి చెందిన వొహ్రా వెన్నునొప్పితో బాధపడుతోంది. దీంతో వెన్ను ఆపరేషన్ చేసేందుకు సిద్ధపడిన ఈ డాక్టర్ ప్రబుద్ధుడు ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఆమె నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు.

కాగా... ఒక సంవత్సరంపాటు వెన్ను సంబంధిత ఆపరేషన్లను నిర్వహించకూడదంటూ, బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే గుయెన్‌పై ఆంక్షలు విధించింది. అయితే వాటిని తుంగలో తొక్కిన ఈ ప్రబుద్ధుడు వొహ్రాకు ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ సమయంలో రోగి గుండెతో నేరుగా సంబంధం ఉండే మహా ధమనికి గాయం చేశాడు.

దీంతో అధిక రక్తస్రావంతో అల్లాడుతున్న వొహ్రా ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో, ఆమెను నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్‌హెచ్ఎస్)కు తరలించారు. మృత్యువుతో పోరాడుతున్న ఆమెకు మరో రెండు ఆపరేషన్లను నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మరణించింది.

వొహ్రాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ చిన్హ్ గతంలో కూడా ఇలాంటి తప్పిదాలే చేశాడు. ఈయన బారిన పడిన ఐదుగురిలో ఒకరు మృత్యువాకిట దాకా వెళ్లి తిరిగి రాగా, వొహ్రా మాత్రం కానరాని దూరాలకు వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే.. ఇతగాడికి మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :