ప్యాంటు వేసుకున్నందుకు జైలు పాలయిన జర్నలిస్ట్..!

women
Ganesh|
FILE
మహిళలు ప్యాంటు తొడుక్కోవటం సూడాన్ షరియా చట్టం ప్రకారం నేరం అన్న విషయాన్ని మరచిన ఆ దేశ మహిళా జర్నలిస్ట్ ఒకరు ప్యాంటు ధరించినందుకుగానూ జైలుశిక్షకు గురయ్యారు. ప్యాంటు ధరించిన నేరానికి పాల్పడిన లాబ్నా అహ్మద్ అల్ హుసేనీకి అనే మహిళకు సూడాన్ రాజధాని ఖార్తూమ్‌లోని ఓ కోర్టు సోమవారంనాడు కొరడా దెబ్బలకు బదులు 200 డాలర్ల జరిమానాను శిక్షగా విధించింది.

ఒకవేళ హుసేనీ జరిమానా కట్టలేని పక్షంలో నెల రోజులపాటు జైలుశిక్షను అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆమె జరిమానా చెల్లించేందుకు నిరాకరించారు. జరిమానా కట్టనని, జైలుకే వెళ్తానని ఆ మహిళా జర్నలిస్ట్ పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను జైలుకు తరలించారు.

ఇదిలా ఉంటే... రెండు నెలల క్రితం ప్యాంటు ధరించిన హుసేనీ ఖార్తూమ్‌లోని ఓ రెస్టారెంట్‌లో తన మిత్రులతో కలిసి ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. కాగా... సూడాన్ షరియా చట్టాల ప్రకారం మహిళలు ప్యాంటు ధరించడం నిషిద్ధం. అయితే ఆమె కోర్టుకు హాజరవుతూ కూడా ప్యాంటు ధరించి రావటం ఆమె ధిక్కార స్వరానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.


దీనిపై మరింత చదవండి :