బీబీసీ డ్యాన్స్ షోలో ఎన్నారై నటికి అవమానం

NRI Women
Ganesh|
FILE
బ్రిటన్‌లో లక్షలాది మంది వీక్షించే బీబీసీ టీవీ డ్యాన్స్ పోటీలలో టీవీ స్టార్ ఆంటోన్ డూ బెకె, భారతీయ సంతతికి చెందిన నటి లైలా రౌస్‌ను "పాకీ" అని తిట్టిపోయటం సర్వత్రా వివాదాస్పదమైంది. దీంతో ఈ పోటీలు కాస్తా వర్ణ వివక్షా వేదికగా మారిపోయాయి. నృత్యకారుడు, టీవీ కార్యక్రమ సమర్పకుడు అయిన బెకె పదిహేను రోజుల క్రితం తోటి నటిపట్ల అవమానకరమైన పదం వాడారని "ది న్యూస్ ఆఫ్ ది వరల్డ్ టాబ్లాయిడ్" పత్రిక ఓ కథనంలో వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. వివక్ష గురైన నటి లైలా తల్లి భారతీయురాలు కాగా.. తండ్రి మొరాకో జాతీయుడు. లైలా, బెకెలు ఇద్దరూ కలిసి బీబీసీ టీవీలో పేరుగాంచిన డాన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోటీల సందర్భంగా పదిహేనుమంది సమక్షంలో బెకె తిట్టినట్లు పై పత్రికా కథనం ద్వారా తెలుస్తోంది. బెకె వ్యాఖ్యలకు ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన లైలా.. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయారని సమాచారం.

అయితే ఈ విషయంపై బీబీసీ టీవీ ప్రతినిధి మాట్లాడుతూ... పనిచేసేచోట దురుసు పదజాల ప్రయోగాన్ని తాము ఆమోదించబోమని తేల్చి చెప్పారు. ఆ తరువాత పరిణామాలలో బెకె సహనటికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా.. రిహార్సల్స్ సమయంలో లైలాకు తనకు మధ్య గొడవ జరిగిందనీ.. పట్టరాని కోపంతో తాను ఆమెను తిట్టినమాట వాస్తవమేనని బెకె అంగీకరించారు.

కోపంతో అలా మాట్లాడానే తప్ప.. లైలాపట్ల తనకు జాత్యహంకార ధోరణి లేదని, అయితే అలాంటి పదం వాడినందుకు బాధపడుతున్నానని, అనాలోచితంగా అలా దూషించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని బెకె వెల్లడించారు. దీంతో బెకెను సహృదయంతో అర్థం చేసుకుని, ఆయన క్షమాపణలను ఆమోదిస్తున్నట్లు లైలా చెప్పటంతో కథ సుఖాంతమయ్యింది.


దీనిపై మరింత చదవండి :