"మిస్ బాలీవుడ్ యూకే"గా లండన్ భామ రీనా

Women
Ganesh|
FILE
భారత సంతతికి చెందిన లండన్ అందాల భామ రీనా పటేల్ "మిస్ బాలీవుడ్ యూకే" కిరీటాన్ని సొంతం చేసుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో కన్నుల పండువగా జరిగిన తుది పోటీలో రీనా విజేతగా నిలిచింది. మాంచెస్టర్‌కు చెందిన మరో భారత సంతతి అందగత్తె సిమ్రాన్ చద్దా రన్నరప్‌గా నిలవగా, స్టాసీ ఫాక్స్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే... 23 సంవత్సరాల రీనా పటేల్ ప్రాథమిక పోటీలో 900మంది అభ్యర్థులను వెనక్కి నెట్టి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌లో ఆమె 14 మందితో గట్టి పోటీని ఎదుర్కొని, చివరకు నెంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. న్యాయ నిర్ణేతల్లో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఉండటం విశేషంగా చెప్పవచ్చు.

కాగా... ఈ పోటీలలో విజేతగా నిలిచిన వారికి బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం కల్పిస్తామని మిస్ బాలీవుడ్ యూకే అవార్డు సంస్థ సీఈఓ జియా చౌదరి వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు త్వరలోనే రీనా ముంబై తరలిరానుంది. ఈ సందర్భంగా రీనా మాట్లాడుతూ... మిస్ బాలీవుడ్ యూకే కిరీటం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు.


దీనిపై మరింత చదవండి :