లండన్‌లో ప్రవాస భారతీయ మహిళ దారుణ హత్య

Women
Ganesh|
FILE
భారత సంతతికి చెందిన మహిళ ఒకరు లండన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు జరిపిన దాడిలో మృతురాలి కుడిచేయి దేహం నుంచి విడిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి భర్తతో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వస్తే.. తన ఇద్దరు పిల్లలను పాఠశాల నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లిన గీత ఆలాక్ అనే ప్రవాస భారతీయ మహిళ పశ్చిమ లండన్‌లోని గ్రీన్‌ఫోర్డ్‌లో దాడికి గురయ్యారు. ఈ దాడిలో ఆమె దేహం నుంచి శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో భయభ్రాంతులకు గురయిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నాలుగ్గంటలపాటు ప్రాణాలతో పోరాడిన ఆమె మరణించారు.

స్థానిక సన్‌రైజ్ రేడియో స్టేషనులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న గీత.. తన పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఆఫీసు నుంచి వెళ్లారు. అరగంట తర్వాత దాడికి గురైన ఆమె.. తీవ్ర గాయాలతో స్థానిక చారింగ్ క్రాస్ ఆసుపత్రిలో రాత్రి 11.20 గంటల ప్రాంతంలో ప్రాణాలు విడిచారు. కాగా.. ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే... గీత ఏడాది క్రితం తన భర్త హర్‌ప్రీత్ నుంచి విడిపోయారు. అందరితో సరదాగా ఉండే గీత దారుణ హత్యకు గురికావటంతో ఆమె స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో తమకు అర్థం కావటం లేదని సహ ఉద్యోగి సీమా సిధా ఆవేదన వ్యక్తం చేశారు. గీత హత్య తమను షాక్‌కు గురిచేసిందని ఆమె వాపోయారు.


దీనిపై మరింత చదవండి :