వైఎస్సార్‌కు మిన్నెసోటా గవర్నర్ సతీమణి నివాళి

YSR
Ganesh|
FILE
దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర గవర్నర్ సతీమణి మారీ పాలెంటీ ఘనంగా నివాళులు అర్పించారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ) డల్లాస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాలెంటీ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి, కొవ్వొత్తి వెలిగించి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పాలెంటీ మాట్లాడుతూ... తన ఇటీవలి హైదరాబాద్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో సమావేశమైన రోజునాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆయన నాయకత్వ పటిమను, దార్శనికతను కొనియాడారు. వైఎస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన పాలెంటీ.. రాజశేఖరరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సహాయం అందించే "హార్ట్ లింక్" అనే స్వచ్చంధ సంస్థకు పాలెంటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఇక్కడి ఆసుపత్రుల పనితీరుపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ సంప్రదాయానికి ముగ్ధురాలైన పాలెంటీ.. వైఎస్సార్‌కు నివాళులు అర్పించేందుకు చక్కని చీరకట్టుతో విచ్చేశారు.

ఈ సందర్భంగా ఐఏఎఫ్‌సీ ప్రధాన కార్యదర్శి తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. హార్ట్ లింక్ సంస్థకు తమ వంతు సహాయాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఎలెక్ట్, కార్యదర్శి, ఐఏఎఫ్‌సీ కోశాధికారి, తానా ప్రాంతీయ డైరెక్టర్.. తదితరులు పాల్గొని ప్రియతమ నేతకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.


దీనిపై మరింత చదవండి :