లడక్: చూడాల్సిన ప్రదేశాలు

WD| Last Modified ఆదివారం, 3 జూన్ 2007 (18:32 IST)
సింధులోయ నాగరికత చిహ్నాలెన్నింటినో లడక్‌లో చూడవచ్చు. లడక్‌లోని లెహ్‌ ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. 17వ శతాబ్దంలో సెంగె నంగ్యాల్‌ ఇక్కడ నిర్మించిన తొమ్మిదంతస్తుల రాజసౌధం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇండస్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న షె పట్టణంలో ఎన్నో రాజభవనాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి.

వీటిలో చాలా భవనాలను 1980లో పునర్‌నిర్మించారు. దీనికి సమీపంలోనే ఉన్న బాస్గో, టంగ్‌మాస్కాంగ్‌ ప్రాంతాలు 15వ శతాబ్దంలో ఒక వెలుగు వెలిగాయి. అప్పటి వైభవానికి చిహ్నంగా శిథిలావస్థలో ఉన్న కట్టడాలు, ఆలయాలు ఈ ప్రాంతంలో కనబడతాయి.

లడక్‌ ప్రాంతాన్ని గతంలో ఎందరో రాజులు చిన్నా చితకా రాజ్యాలు ఏర్పరచుకుని పాలించారు. వారిలో ఫియాంగ్‌, హెమిస్‌, చిబ్రా అనేవారు ప్రసిద్ధులు. బౌద్ధమతానికి ముందు వీరు పలు మతాలకు ప్రాణం పోసినట్టు దాఖలాలు ఉన్నాయి. లడక్‌ ప్రాంతంలో అనేక తెగలు కూడా చిరకాలం వర్ధిల్లాయి. ఆ సమయంలో ఎన్నో దేవాలయాలను సైతం నిర్మించారు. ఇలాంటి వాటిలో అల్చి ప్రార్థనాస్థలం ఒకటి.

ఐదు దేవాలయాల సమూహమిది. ఆలయాల లోపల అద్భుతమైన వర్ణ చిత్రాలు ఆశ్చర్యం గొలుపుతాయి. ఇవి 11, 12 శతాబ్దాల కాలంనాటివిగా చెబుతారు. ఈ ఆలయంలో పూజాదికాలు నిలిచిపోయి చాలా ఏళ్లు అవుతున్నా, లికిర్‌ మతప్రముఖులు కొందరు వీటిని ఇప్పటికీ సంరక్షిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :