భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?
జనవరి 29, గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్మ ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాం. మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన అనంతరం భీష్ముడు విష్ణుమూర్తిని సహస్రనామాలతో స్తుతించి, విశ్వరూప దర్శనాన్ని పొంది తన ఇచ్ఛానుసారంగా తనువు చాలించారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి.
భీష్ముని జీవితం యావత్తు త్యాగమయమే. పాండవులకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన రాజ్యాన్ని ఇచ్చేయమని యుద్ధం వద్దని దుర్యోధనునికి ఎంత చెప్పిన వినక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కౌరవుల పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటారు.
అర్జునుని శరాఘాతాలకు రణరంగంలో కుప్పకూలిపోయారు. అర్జునుడు తన తాతగారిపై గౌరవంతో అంపశయ్యను ఏర్పాటు చేస్తారు. భీష్ముడు అంపశయ్యపై ఉన్న తనను చూడటానికి వచ్చిన ధర్మరాజుకు రాజనీతి సారాంశాన్ని మొత్తం బోధిస్తారు.
అంపశయ్యపై 58 రోజులు ప్రాణాలు నిలుపుకుని చివరకు ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ శుద్ధ ఏకాదశి రోజు మోక్షాన్ని పొందారని మహా భారతంలో వివరించి ఉంది. తన జీవితాంతం ఘోటక బ్రహ్మచారిగా గడిపిన భీష్ముడు మోక్షాన్ని పొందిన మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
ప్రతి ఏకాదశికి పాటించే నియమాలు భీష్మ ఏకాదశి రోజు కూడా పాటించాలి. మాఘ శుద్ధ దశమి నాటి రాత్రి నుంచి మాఘ శుద్ధ ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండాలి. ఏకాదశి రాత్రివేళ జాగారం చేయాలి. వీటితోపాటు ఈ రోజు విష్ణు పూజ తప్పనిసరిగా చేయాలి.
ఈ రోజు మొదలు పెట్టిన ఏ కార్యమైనా విజయవంతంగా పూర్తవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇక భీష్మ పితామహుడు మనందరికీ ఆద్యుడు, పూర్వీకుడు కనుక ఈ రోజు భీష్మునికి తర్పణాలు విడిచి పెట్టడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, విష్ణు సహస్రనామాలను జపిస్తూ, భగవద్గీతను పారాయణ చేయడం విశిష్ఠ ఫలితాలను అందిస్తుంది.