బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 మార్చి 2015 (18:59 IST)

భక్తులను సదా అనుగ్రహించే కృష్ణ పరమాత్మ.. ఇచ్చిన మాటే ముఖ్యం!

శ్రీకృష్ణుడు భక్తులను సదా అనుగ్రహించేందుకే అనేక అవతారాలెత్తాడు. భక్తులకు ఇచ్చిన మాట కోసమే స్వామి ఆవిర్భవించిన దాఖలాలు కోకొల్లలు. అలాగే ప్రహ్లాదుడి అనితరసాధ్యమైన భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు, అతని వంశీకులను సంహరించనని మాటయిస్తాడు.

ఆ మాటకి కట్టుబడే అతని కుమారుడైన 'బలిచక్రవర్తి' విషయంలో స్వామి సహనాన్ని పాటిస్తాడు. అతనితో ఎలాంటి యుద్ధానికి పాల్పడకుండా పథకం ప్రకారం పాతాళలోకానికి పంపించివేస్తాడు. ఇక బలిచక్రవర్తి కొడుకైన 'బాణాసురుడు' విషయంలోను శ్రీమహావిష్ణువుకి ఈ వరం అడ్డుపడుతుంది. బాణాసురుడు ఎంతటి శివభక్తుడో... అంతటి విష్ణుద్వేషి.
 
బాణాసురుడి కుమార్తె అయిన ఉషను శ్రీకృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడు ప్రేమిస్తాడు. వారి వివాహానికి నిరాకరించిన బాణాసురుడు, కృష్ణుడిపై కోపంతో అనిరుద్ధుడిని బంధిస్తాడు. హరి ద్వేషి అయిన బాణాసురుడు, శ్రీకృష్ణుడిపై తనకి గల ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఎంతగా నచ్చజెప్పినా బాణాసురుడు వినిపించుకోకపోవడంతో, అతనిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించడానికి శ్రీకృష్ణుడు సిద్ధపడతాడు.
 
అంతలో ప్రహ్లాదుడు అక్కడకి వచ్చి .. శ్రీమన్నారాయణుడి స్వరూపమైన కృష్ణ పరమాత్ముడి పాదపద్మాలకు సభక్తికంగా నమస్కరిస్తాడు. తన వంశీకులను సంహరించనంటూ నారాయణుడు ఇచ్చిన మాటను గుర్తుచేస్తాడు. దాంతో ఇచ్చినమాటకు కట్టుబడివుండే కృష్ణభగవానుడు తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. ఫలితంగా బాణాసురుడు బతికిపోతాడు. శివకేశవులకు భేదం లేదని తెలుసుకుని తన మనసు మార్చుకుంటాడు.