శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By దీవి రామాచార్యులు (రాంబాబు)
Last Updated : బుధవారం, 16 మార్చి 2016 (17:37 IST)

సీతకు కొన్ని శుభశకునములు కనబడుట: సీతకు శోకము ఎలా తొలగెను!?

వ్యథ చెంది, సంతోషము లేక దీనమైన మనస్సుకో ఉన్న దోషములేక శూన్యయైన, మంగళప్రదురాలైన ఆ సీతను, ఐశ్వర్యము లభించిన మనుష్యుని భృత్యులందరూ వచ్చి చేరినట్లు, శుభశకునములు వచ్చి చేరినవి. (సీతకు శుభశకునములు కనబడినవి). అందమైన కేశములు గల ఆ సీత వామనయనము వంకరగా ఉన్న రెప్పల వెండ్రుకల పంక్తితో, శుభకరమై, విశాలముగాను, నల్లగాను, తెల్లగాను ఉండెను. ఆ వామనయనము తాకిడికి, మీనము ఎర్రని పద్మమొక్కటి కదిలినట్లు అదిరెను. సీతాదేవి ఎడమభుజము చక్కగా, చూచుటకు ముచ్చటగొల్పుచు బలిసి, వృత్తముగా (గుండ్రముగా) ఉండెను.
 
అది శ్రేష్ఠమైన అగురువు, చందనము పూసికొనుటకు తగినది. చాలాకాలము ఆ భుజమును తలగడగా చేసుకుని అత్యుత్తమ పురుషుడైన రాముడు శయనించుచుండెడివాడు. అట్టి భుజము కూడా వెంటనే అదరెను. దగ్గరగా కలిసి ఉన్న ఆమె రెండు తొడలలో ఒక ఎడమ తొడ అదురుచు రాముడు ఎదుటనే ఉన్నాడని ఆమెకు చెప్పెను. సుందరమైన ఆ తొడ ఏనుగు వలె బలిసి వుండెను. నిర్మలమైన నేత్రములు, కొనలు తేలిన దంతములు, అందమైన శరీరమూ గల ఆ సీత నిలిచి ఉండగా, మంగళప్రదమూ, బంగారముతో సమానమైన రంగుగలదీ, పరాగము కప్పివేయుటచే కొంచెము కాంతి విహీనముగా ఉన్నదీ అయిన వస్త్రము కొంచెము జారెను. 
 
పూర్వము కూడా అనేక పర్యాయములు సత్ఫలమును ఇచ్చిన ఈ శకునములు శుభము రానున్నది సూచించుటకే, మంచి కనుబొమ్మలు గల సీత, గాలికి ఎండకు ఎండిపోయి కనబడకుండా పోయిన విత్తనము వర్షము కురియగానే మొలకెత్తినట్లు ఆనందించెను. దొండపండు వంటి అధరోష్ఠమూ, అందమైన నేత్రములు, కనుబొమ్మలు, కేశాంతములు, వంకరయైన రెప్పలూ, తెల్లని అందమైన దంతములూ గల ఆమె ముఖము, రాహుముఖము నుంచి బయటకు వచ్చిన చంద్రబింబము వలె ప్రకాశించెను. పూజ్యురాలైన ఆ సీతకు శోకము తొలగెను. 
 
అలసత్వము పోయెను. మానసిక సంతాపము శాంతించెను. సంతోషముతో మనస్సు వికసించెను. అప్పుడామె తేజోవంతమైన ముఖముతో, శుక్లపక్షమునందు ఉదయించిన చంద్రునితో రాత్రి ప్రకాశించినట్లు ప్రకాశించెను. - ఇంకా వుంది.. దీవి రామాచార్యులు.