శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By దీవి రామాచార్యులు
Last Updated : మంగళవారం, 1 మార్చి 2016 (17:29 IST)

సీత విలపించుచు ప్రాణములు విడుచుటకు ఉద్యమించుట!

సీత రాక్షసరాజైన రావణుని అప్రియములైన మాటలు విని, రాముడు లేకపోవుటచేత దుఃఖముతో బాధపడుతూ.. వనమధ్యమునందు సింహముచేత ఆక్రమించబడిన చిన్న ఆడ ఏనుగు వలె భయపడెను. రాక్షసస్త్రీల మధ్య ఉన్న భయస్వభావము గల ఆ సీత రావణుడు కూడా మాటలతో అధికముగా భయపెట్టుటచేత, విజనమైన అటవీ మధ్యములో ఒంటరిగా విడిచిపెట్టబడిన బాలయై కన్యవలె విలపించెను. 
 
పాపాత్మురాలనైన నేను ఈ విధముగా వీళ్ళందరూ భయపెట్టుతున్నా దీనురాలనై, క్షణము పాటనైను జీవించుచున్నాను. అనగా, అకాలము నందు మరణము రాదు అని సత్పురుషులు లోకములో చెప్పుమాట సత్యమే! ఎట్టి సుఖమూ లేక అత్యధికమైన దుఃఖముతో నిండిన ఈ నా హృదయము నిజముగా చాలా గట్టిది. అందుచేతనే వజ్రముతో కొట్టబడిన పర్వత శిఖరమువలె ఇప్పుడు కూడా ఇది వెయ్యిముక్కలుగా బ్రద్ధలగుట లేదు.
 
ఈ విషయములో నా దోషమేమీ లేకుండగానే చూచుటకు అప్రియుడైన ఆ రావణుడు నన్ను చంపనున్నాడు. ద్విజుడు, ద్విజుడు కాని వానికి మంత్రమును ఏ విధముగా ఇవ్వజాలడో, నేను అదే విధముగా వీనికి నా మనస్సును ఇవ్వజాలను. లోకములకు ప్రభువైన రాముడు రాకున్నచో, చెడ్డవాడైన ఈ రావణుడు శస్త్రచికిత్సకుడు గర్భములో ఉన్న శిశువును ఛేదించినట్లు, నా అవయవములను వాడియై శస్త్రములతో తప్పక చేధించును. రాజు విషయములో చేసిన అపరాధమునకు బద్ధుడై తెల్లవారుజామున చంపవలిసియున్న దొంగకువలె దుఃఖితురాలినైన నాకు ఇచ్చిన రెండు మాసములు గడువు ఆలస్యముగా గడచును. అయ్యో! ఎంత కష్టము వచ్చిపడినది. 
 
అయ్యో! రామా! అయ్యో! లక్ష్మణా! అయ్యో! సుమిత్రా! అయ్యో కౌసల్యా! అయ్యో! నా తల్లీ! దుర్భాగ్యవంతురాలనైన నేను మహాసముద్రములో గాలిచేత ఎటు వెళ్ళుటకూ వీలులేని ఓడవలె నశించుచున్నాను. ఆ ప్రాణి ఎవరో మృగరూపమును ధరించి మహాబలశాలులైన ఆ రామలక్ష్మణులను, పిడుగు శ్రేష్ఠములైన రెండు సింహములను చంపివేసినట్లు నా మూలమున చంపివేసినది. సందేహము లేదు. 
 
నిజముగా ఆనాడు కాలపురుషుడు, మృగము రూపములో వచ్చి దురదృష్టవంతురాలినైన నన్ను లోభపెట్టినాడు. అందుచేతనే నేను తెలివితక్కువతనముచే ఆర్యపుత్రునీ, లక్ష్మణునీ కూడ దూరముగా పంపివేసితిని. సత్యవ్రతుడవూ, దీర్ఘములైన బాహువులు కలవాడవూ అయినా ఓ రామా! చంద్రుని వంటి ముఖము గలవాడా! అయ్యో ప్రాణిలోకానికి హితము చేయువాడవూ ప్రియుడవూ అయిన నీకు నేను రాక్షసుల చేతిలో చిక్కి వధ్యురాలనుగా ఉన్నానని తెలియదు కదా!. 
 
మనుష్యులు కృతఘ్నులకు చేసిన ఉపకారము ఎట్లు వ్యర్థమైపోవునో, అట్లే నేను భర్తను తప్ప మరి ఏ దేవుని పూజించకుండట, ఈ ఓర్పు, నేల మీద శయనించుట, ధర్మనియమము, పతివ్రతాత్వము - ఇవి అన్నీ వ్యర్థమైపోయినవి. నీకు దూరమై, నిన్ను చూడజాలక, నిన్ను కలుసుకొందుననే ఆశకూడా లేక, చిక్కి సౌందర్యము చెడి ఉన్న నేను చేసిన ఈ ధర్మమంతా వ్యర్థమైనది! ఈ ప్రతివ్రతాత్వము కూడా నిష్ప్రయోజనము!
 
నీవు ఆజ్ఞను నియమపూర్వకముగా పాలించి, సత్యవ్రతము ఆచరించి వనము నుండి అయోధ్యకు తిరిగి వెళ్ళినవాడవై, కృతార్థుడవై, ఎట్టి భయములు లేక, విశాలములైన నేత్రములు గల స్త్రీలతో విహరించగలవని అనుకొనుచున్నాను. నీయందనురక్తురాల నగు నేను నాశనము కొరకే నీపై చిరకాలము మనసునిలిపి, వ్యర్థముగా తపము, వ్రతము చేసి జీవితము విడిచిపెట్టెదను. ఛీఛీ నేనెంత దురదృష్టవంతురాలను! అట్టి నేను విషముచేతగాని, శస్త్రముచేతగాని శ్రీఘ్రముగా నా జీవితము విడిచెదను. రాక్షసుని ఇంటిలో నాకు విషముగాని శస్త్రముగాని ఎవ్వరూ ఇవ్వరు గదా!
 
సీత ఇట్లు అనేక విధములుగా విలపించి, సర్వవిధాలా రామునే స్మరించుచు, వణికిపోవుచున్నదై, ఎండిపోయిన ముఖముతో పుష్పించిన ఆ ఉత్తమవృక్షము దగ్గరకు వెళ్లెను. శోకముతో బాధపడుచున్న సీత ఇట్లు అనేక విధములుగా ఆలోచించి ఉరిత్రాడు వలె ఉన్న జడను చేతిలో పట్టుకొని - ''నేను జడతో ఉరిపోసుకుని, శీఘ్రముగా యమలోకమునకు వెళ్లెదను'' అని నిర్ణయించుకొనెను. 
 
మృదువైన సకలావయవములు గల ఆ సీత ఆ వృక్షశాఖను పట్టుకుని నిలిచెను. రాముని, లక్ష్మణుని తన కులమును గూర్చి ఆలోచించుచున్న, శుభమైన అవయవములు గల ఆ సీతకు ధైర్యమును కలిగించు అనేకములైన శుభశకునములు కనబడెను. శోకమును తొలగించేవి, అత్యుత్తములుగా లోకములో ప్రసిద్ధములూ అయిన ఆ శకునములు పూర్వము కూడా అనేక పర్యాయములు కనబడి సఫలము లయ్యెను.- ఇంకా వుంది.