గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By PNR

కుక్కకాటును నయం చేసే 'కుక్‌రైల్ నాలా' స్నానం

WD PhotoWD
లక్నోలోని ఏదో ఓ రోడ్డుపై మీరు నడుస్తుండగా ఏదైనా వీధి కుక్క మిమ్మల్ని కరవడం లేదా మీరెంతో ప్రేమగా పెంచుకుంటున్న మీ పెంపుడు కుక్క తన వాడియైన దంతాలతో మిమ్మల్ని గాయపరిచిందనుకోండి. అందుకు విరుగుడుగా 'కుక్‌రైల్ నాలా'గా పిలవబడే మురికి వాగులో స్నానం చేస్తే సరిపోతుంది.

మీరు నమ్మినా నమ్మకపోయినా, లక్నోలోని ప్రధాన ప్రాంతమైన ఫయిజాబాద్ రోడ్డులో గల ఈ వాగులో కుక్కకాటుకు విరుగుడుగా ప్రజలు స్నానం చేసే తంతు అనేక సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నది. కుక్కకాటు నుంచి ఉపశమనం పొందేందుకు దూరప్రాంతాల నుంచి సైతం అనేక మంది కుక్కకాటు బాధితులు ఇక్కడకు వస్తుంటారు. ప్రత్యేకంగా అధికారులైన కొందరు ఐఏఎస్ అధికారులు సైతం ఇక్కడకు వచ్చి స్నానం చేస్తుంటారని స్థానికులు అంటున్నారు.

వాగునకు ఒకవైపు మురికివాడ ఉండగా మరోవైపు స్థలం ప్రజల స్నానానికై నిర్దేశించబడింది. స్థానికుల సమాచారాన్ని అనుసరించి రాజధానికి 20 నుంచి 30 కి.మీ.ల దూరంలో గల 'బక్షి కా తాలాబ్' (కొలను) నుంచి ఆవిర్భవించిన ఈ వాగు 'భైయిసాకుండ్' యొక్క గోమ్‌తీ బాయిరాజ్‌లోకి ప్రవహిస్తుంది. ఈ కుక్‌రైల్ వాగు (ఫయిజాబాద్ రోడు యొక్క బ్రిడ్జ్ దిగువన)లో స్నానం చేసినట్లయితే కుక్కకాటు తాలూకూ విషప్రభావం తొలగిపోతుందని ఒక నమ్మిక.

కుక్కకాటుకు గురై ఉపశమనం కోసం స్నానం చేసే నిమిత్తం ప్రతి రోజు ఉదయం పెద్ద సంఖ్యలో బారులు తీరిన జనాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. స్నానం చేసిన అనంతరం 'సట్టు' (ఉలవలు మరియు గోధుమల మిశ్రమ పిండి) మరియు 'గుడ్' (బెల్లపు పాకం)లతో చేసే ప్రత్యేక ప్రార్థనలో వాళ్ళు పాల్గొంటారు. కుక్కకాటు
WD PhotoWD
బాధితుల తరపున పూజ చేసేందుకు ప్రత్యేకించిన కొద్ది మంది ప్రజలు అక్కడ కనిపిస్తారు. సంజయ్ జోషి, నోన్‌డర్ మరియు నూర్జహాన్ అటువంటి వారి కోవలోకి వస్తారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాలుగు తరాలుగా తమ కుటుంబం ఈ విధమైన చికిత్సను చేస్తున్నదని సంజయ్ జోషి చెప్పుకొచ్చాడు. మన్‌కామేశ్వర్ దేవాలయానికి సమీపంలోని కాలనీలో అతడు నివాసముంటున్నాడు. చికిత్సలో వినియోగించే ఇనుప పటకారును అతడు మాకు చూపించాడు. ప్రత్యేక ప్రార్థన వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన అతను, అదేసమయంలో భైరవదేవుని తాను ప్రార్థిస్తానని మాతో చెప్పాడు.

WD PhotoWD
ముదుసలిగా ఈ చికిత్స చేస్తున్న నూర్జహాన్ తల్లి నయిమూల్‌నిషా తన 130వ ఏట సైతం ఈ చికిత్సను అందించింది. మహిళల సౌకర్యార్థం ఇక్కడ ఒక స్నానాల ఘట్టాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మహిళారోగులు ఈ వాగులో బహిరంగంగా స్నానమాచరిస్తున్నారు.

కుక్కకాటుకు విరుగుడు పొందేందుకు మాన్‌పూర్ గ్రామానికి చెందిన విశాల్ అనే రోగి తన తండ్రితో సహా ఇక్కడకు వచ్చాడు. ఆదివారం మరియు మంగళవారాలలో కనుక ఈ వాగులో స్నానం చేసినట్లయితే కుక్కకాటు విరుగుడుకు ఎటువంటి ఇంజెక్షన్లు చేయించుకోనవసరం లేదనేది విశాల్ తండ్రి విశ్వాసం.

లక్నో సమీపంలోని రాయ్‌బరేలి రోడ్డు, శారద నగర్, రజనీ ఖండ్, సెక్టార్-8కు చెందిన మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్ కుమారుడు మహ్మద్ షహీద్‌ను మేము కలిశాము.
WD PhotoWD
తొమ్మిది సంవత్సరాల క్రితం కుక్కకాటుకు గురైన తాను ఈ వాగులో స్నానం చేయడం ద్వారా ఉపశమనం పొందినట్లు అబ్దుల్ అత్యంత విశ్వాసంగా తెలిపాడు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అలాగే.. మహాబుల్లాపూర్ వాసి అయిన మున్నాలాల్ గుప్తా కుమారుడైన 10 సంవత్సరాల అంకుర్ కూడా ఇక్కడ చికిత్స పొందేందుకు వచ్చాడు. మూడు సంవత్సరాల క్రితం కుక్కకాటుకు గురైన తన సోదరుడు ఇక్కడి వాగులో స్నానం చేయడం ద్వారా ఉపశమనం పొందాడని మున్నాలాల్ విశ్వసిస్తున్నాడు.
WD PhotoWD
విశ్వాసానికి మూలం:- స్థానిక శక్తి నగర్ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ డిప్యూటీ రిజిస్ట్రార్ సి.ఎన్.సింగ్ చెప్పిన దానిని బట్టి చూసినట్లయితే, ఒకానొక కాలంలో, ఆఘ్ఘనిస్థాన్‌కు చెందిన ఒక వ్యాపారి తాను పెంచుకుంటున్న ఆడ కుక్కతో సహా ఇక్కడకు వచ్చాడు. ఇక్కడే ఆ వ్యాపారి తన సంపదనంతా కోల్పోతాడు. దాంతో ఒక భూస్వామికి తన కుక్కను తాకట్టు పెట్టి కొంత డబ్బును ఆ భూస్వామి నుంచి పొందుతాడు.

ఇదిలా ఉండగా ఒక రోజు భూస్వామి ఇంటి నుంచి కాజేసిన డబ్బును కొందరు దొంగలు బావిలో దాచిపెట్టడాన్ని వారినే అనుసరించి వెళ్ళిన కుక్క గమనిస్తుంది. దొంగలు డబ్బును దాచిన స్థలాన్ని భూస్వామికి కుక్క సంకేతమాత్రంగా తెలియచేస్తుంది. కుక్క చూపిన విశ్వాసానికి మెచ్చిన భూస్వామి కుక్కకు స్వేచ్ఛను ప్రసాదిస్తాడు.

ఇదిలాఉండగా ఆఘ్ఘనిస్థాన్ నుంచి తిరిగి వచ్చిన వ్యాపారి, భూస్వామి వద్ద తన పెంపుడు కుక్క లేకపోవడాన్ని చూచి మనస్తాపం చెందుతాడు. తిరిగి వస్తుండగ
WD PhotoWD
అతనికి దారిలో కుక్క తారసపడుతుంది. ఆగ్రహించిన వ్యాపారి, కుక్కను బావిలో దూకవలసిందిగా ఆదేశిస్తాడు. యజమాని ఆజ్ఞకు కట్టుబడిన కుక్క బావిలో దూకి మరణిస్తుంది. కుక్క మరణానికి పశ్చాత్తాపం చెందుతున్న వ్యాపారికి కుక్క ఆత్మ కనిపించి బావిలోని నీరు కుక్కకాటుకు విరుగుడుగా పనిచేస్తుందని చెపుతుంది. ఈ బావి ఆధారంగానే కుక్‌రైల్ వాగు ఉద్భవించిందని ఒక విశ్వాసం.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

WD PhotoWD
శాస్త్రీయ దృక్పథం: డా.హేరంబ్ అగ్నిహోత్రి మాటలను అనుసరించి ఆయన ఈ వాగును గురించి వినడం జరిగింది కానీ కుక్కకాటు విరుగుడుకు సంబంధించిన ఎలాంటి శాస్త్రీయమైన రుజువులు లభించలేదు. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి తన యొక్క వైరస్‌లను వెన్నెముక ద్వారా మెదడులో కేంద్రీకృతం చేసే ర్యాబిస్ వ్యాధి కుక్కకాటు వలన వస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు. కొంత మందికి ఈ వ్యాధి లక్షణాలు కుక్కకాటు బారిన పడిన నెలరోజులలోనే బయట పడతాయని, మరి కొందరికి వ్యాధి లక్షణాలు బయటపడడానికి 10 సంవత్సారాలు పడుతుందని ఆయన మాతో అన్నారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాధి నివారణకు ఉద్దేశించిన ఇంజక్షన్లు అత్యంత ఖరీదైనవి కావడంతో పేద ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెదుక్కుంటున్నారు. ప్రస్తుతం, ప్రభుత్వం చవుక ధరలకే ర్యాబీస్ నివారక ఇంజక్షన్లను వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో అందచేస్తున్నది. కుక్క కరిచిన వెంటనే మొదట స్నానం చేయవలసిందిగా వైద్యులు రోగులకు సూచిస్తున్న అంశాన్ని ఆయన అంగీకరించారు. ర్యాబిస్ కారక వైరస్‌ను నిర్మూలించగల ఏదేని విషపదార్థాల ఉనికిని ఊహించిన ఆయన తన ఊహకు శాస్త్రీయమైన ఆధారాన్ని మాత్రం కనుగొనలేకపోయారు.