శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By WD
Last Modified: సోమవారం, 27 ఆగస్టు 2007 (16:09 IST)

చరిత్ర పుటల్లో కర్బలా

కర్బలా అపూర్వమైన చరిత్రను కలిగివున్న పట్టణం. నేటితరం వాసుల్లోనే కాకుండా.. ముస్లీం ప్రపంచ తరతరాల ఖ్యాతిని ఇనుమడింప చేసుకున్న పట్టణమే ఈ కర్బలా. ఇమ్మాన్ హుస్సేన్ త్యాగాలకు ప్రతిరూపంగా ఈ పట్టణం పేరుగాంచింది. నేటికీ ఈ పట్టణాన్ని అధిక సంఖ్యలో పర్యాటకులు దర్శించటం విశేషం. ముఖ్యంగా ముస్లీంలను ఈ పట్టణం ఆకర్షిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌తో పాటు, ఇరాక్‌లోని మరో పవిత్ర నగరమైన నజాఫ్ నుంచి ఉన్న రోడ్డు మార్గాలు ఈ ప్రాంతాన్ని కలుపుతున్నాయి. కేవలం ముస్లీంలే కాకుండా ఇతర వర్గాల వారు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. సూర్యకాంతిలో అక్కడి గోపురాలు వెలిగిపోతుంటాయి. పర్యాటకులను అబ్బురపరుస్తాయా గోపురాలు.

కర్బలాలో ప్రసిద్ధిగాంచిన ఇమ్మాన్ హుస్సేన్, అతని సోదరుడు అబుల్ ఫజల్ అల్ అబ్బాస్‌కు సంబంధించిన రెండు పుణ్య క్షేత్రాలున్నాయి. వాటిలోపల వారి కుమారులు అజరత్ అలియా అక్బర్, హజరత్ ఆలీ అస్గర్, హుస్సేన్‌కు అత్యంత సన్నిహితుడు హజరత్ హబీబ్ మజాహిర్ల సమాధులు ఉన్నాయి. కర్బలాలో ఈ సమాధులు ఉన్న ప్రాంతానికి ఓమూలన ఉన్న గంజ్ ఇ షౌహదా వద్ద కర్బాలాలో మతం కోసం ప్రాణ త్యాగం చేసిన 72 మంది భక్తుల సమాధులు కూడా ఉన్నాయి. ఖతల్ ఘా అనే ప్రాంతంలో ఇమామ్ హుస్సేన్ అసలు సమాధి ఉంది. ఈ ప్రాంతంలోని సమాధులు, గోపురాలను స్వర్ణంతో అత్యంత అందంగా అలంకరించారు.

పూర్వం కర్బల పట్టణానికి అంతగా గుర్తింపు లేదు. అక్కడ చెప్పుకోదగిన చారిత్రక కట్టడాలు ఉన్నట్టు ఆధారాలు కూడా లేవు. అయితే కర్బలా పట్టణం.. అత్యంత సారవంతమైన భూమిని కలిగి ఉండటంతోపాటు, నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతంగా పేరొందింది. ఇమామ్ హుస్సేన్ ప్రాణాలు అర్పించిన చోటుగా ప్రసిద్ధిగాంచిన కర్బలాలో పదో మొహర్రం క్రీ.శ. 680 కాలం నుంచి ఈ ప్రాంతాన్ని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సందర్శించడం ఆరంభమైంది. అక్కడకు వచ్చే సందర్శకులు.. తాము ప్రాణాలు వదిలితే ఇక్కడే సమాధి చేయాల్సిందిగా తమ బంధువులను అభ్యర్థించటం ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను చాటిచెపుతుంది.

అయితే విజయవంతమైన పరిపాలకులుగా ఖ్యాతి గడించిన అల్ రషీద్, అల్ ముటతవక్కిల్‌లు ఈ ప్రాంత అభివృద్ధికి ఆంక్షలు విధించారు. అందువల్లే ఈ ప్రాంతం అనుకున్నంతగా అభివృద్ధికి నోచుకోలేక పోయింది.