శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

నాగరికతకు గొడ్డలిపెట్టు 'జల్లికట్టు'

WD
సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు తమిళ ప్రజలలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. సంక్రాంతి అనాదిగా సంప్రదాయంలో ఒక భాగమైన జల్లికట్టు క్రీడను వీక్షించేందుకు జనం తండోప తండాలుగా విచ్చేస్తుంటారు. మానవునికి,మృగానికి మధ్య ఒడలు జలదరింపజేసే రీతిలో సాగే పైశాచిక అనాగరిక క్రీడను రోమాలు నిక్కబొడుచుకుంటుండగా ప్రజలు రెప్పవేయకుండా వీక్షిస్తారు. అంతేనా... మదించిన ఎద్దు, అంతే స్థాయిలో ఆవేశాన్ని ప్రదర్శించే వ్యక్తి... నువ్వా, నేనా అన్న రీతిలో ఒకరిపై సవాల్ చేసుకుంటూ సాగే సమరాన్ని రసవత్తరం చేసేందుకు ఈలలు, కేకలతో మరింతగా ప్రోత్సహిస్తుంటారు.

ఈ వారం ఏది నిజం శీర్షికలో తమిళనాడు, మదురై జిల్లాలో అలంగానల్లూర్, పలమేడు నిర్వహించిన జల్లికట్టు క్రీడను మీకు పరిచయం చేస్తున్నాము. ఎద్దును లొంగదీసుకునే క్రమంలో మనిషి సృష్టించే హింసను నిలువరించే దిశగా ఈ క్రీడను నిషేధించవలసిందిగా కోరుతూ జంతు సంక్షేమ మండలి, సుప్రీం కోర్టుకు విన్నవించుకుంది. సాంప్రదాయం పేరిట ఎద్దులు పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించే జల్లికట్టును శాశ్వతంగా నిషేధించాలని మండలి తన అప్పీల్‌లో కోరింది. ఈ నేపథ్యంలో సాంప్రదాయాన్ని గౌరవిస్తూ జల్లికట్టు క్రీడను కొనసాగించాలా... లేక జంతుహింసను అరికట్టే క్రమంలో క్రీడను నిషేధించాలా... అనే నిర్ణయించాల్సింది మీరే...
WD


ఇక జల్లికట్టు క్రీడ పుట్టుపూర్వోత్తరాలలోకి వెళ్లినట్లయితే... తమిళులు అనాదిగా ఈ క్రీడను నిర్వహిస్తూ వస్తున్నారు. తమిళ సాహిత్యాన్ని అనుసరించి ఎద్దు కొమ్ములు వంచినవాడిని మాత్రమే వివాహమాడటానికి యువతులు ముందుకు వచ్చేవారు. పురాతనకాలంలో జీవితాన్ని పణంగా పెట్టి ఎద్దు కొమ్ములను వంచేందుకు ప్రజలు సాహసించేవారు. మొహంజొదారో మరియు హరప్ప నాగరికతలు వెలుగు చూసినప్పుడు ఈ క్రీడ తాలూకు ఆనవాళ్లు బయటపడ్డాయి.

WD
చారిత్రక ఆధారాలను అనుసరించి ఈ క్రీడ 400 సంవత్సరాలుగా నిర్వహించబడుతోంది. జల్లికట్టు క్రీడలో పాల్గొనే ఎద్దును దూడగా ఉండగానే ప్రత్యేకమైన శిక్షణను ఇస్తారు. పదును తేలిన కొమ్ములతో తన కొమ్ములు వంచడానికి వచ్చే మొనగాన్ని విసిరేంత లాఘవాన్ని శిక్షణ సందర్భంగా ఎద్దు పొందుతుంది. (కోర్టు ఆదేశాలను అనుసరించి ఎద్దు కొమ్ములను పదునుతేల్చే వ్యవహారం నిషేధించబడింది.)

మనిషికన్నా పదింతలు శక్తిమంతమైన ఎద్దును లొంగదీసుకోవడం మానవుని పౌరుష, పరాక్రమాలకు నిదర్శనమని తమిళులు భావిస్తుంటారు. కానీ నాగరిక సమాజంలో ఇది ఒక విశృంఖలమైన క్రీడగా జంతు సంక్షేమ మండలి మరియు న్యాయస్థానం పేర్కొన్నాయి. న్యాయస్థానం జల్లికట్టును నిషేధించినప్పటికీ క్రీడను నిర్వహించని పక్షంలో తమ కులదేవతలు శపిస్తాయని తమిళ ప్రజలు విశ్వసిస్తుంటారు.
WD


తమిళనాడు ప్రభుత్వం హామీ ఇచ్చిన మీదట, జనవరి 16న పలమేడులో, జనవరి 17న అలంగానల్లూర్‌లో జల్లికట్టును నిర్వహించారు. వేలాదిమంది తమిళ ప్రజలతో పాటు విదేశీ పర్యాటకులు సైతం క్రీడావినోదాన్ని పొందారు. సమాజానికి హితం కాని జల్లికట్టును సాంప్రదాయం పేరిట నిర్వహిస్తున్న వైనంపై మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.