శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

మంత్ర జలాన్ని ప్రసాదించే కరేడీ మాత

WD
ఈ వారం ఏదినిజం శీర్షికలో మీ కళ్ల ముందు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాం. కరేడీ మాత విగ్రహం నుంచి హఠాత్తుగా జలం ఉద్భవించడంతో అద్భుతం మొదలైంది. ఇలా వచ్చిన నీరు సర్వరోగ నివారిణిలా పనిచేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. మంత్రజలాన్ని అందించే అమ్మవారి విగ్రహం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాజాపూర్ జిల్లాకు ఎనిమిది కి.మీ.లు దూరంలో గల కరేడీ గ్రామంలోని దేవాలయంలో కొలువై ఉంది.

నిజానిజాలు తెలుసుకుందామని అక్కడకు చేరుకున్న మాకు దేవాలయం వెలుపల కోనేరు కనిపించింది. అదే చోట రాతితో చేసిన విగ్రహం కూడా ఉంది. విగ్రహం భుజానికి రంధ్రం ఉండడం మా కంట పడింది.అక్కడ మేము గ్రామ పెద్ద ఇందర్ సింగ్‌ను కలుసుకున్నాము.
WD


అమ్మవారి విగ్రహం మహాభారత కాలం నాటిదని తెలిపాడు. ఆయన చెప్పిన దానిని అనుసరించి కర్ణావతి విగ్రహాన్ని కర్ణుడు పూజించేవాడు. పేద ప్రజలను ఆదుకోనెందుకు గాను పెద్ద మొత్తంలో బంగారాన్ని విగ్రహం కర్ణునికి ఇస్తుండేది. ఉజ్జయినీ మహారాజు విక్రమాదిత్యుడు సైతం కర్ణావతి అమ్మవారిని పూజించారని కొందరు ప్రజలు విశ్వసిస్తున్నారు.
WD
కొద్ది రోజుల క్రితం ఆ రంధ్రం నుంచి నీరు రావడం మొదలైందని ఆలయ పూజారి మాతో చెప్పారు. నీటిని తొలగించిన కొద్ది సేపటికే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ రంధ్రంలో నీరు చేరుకుందని అన్నారు. దీంతో ఈ సంఘటన అమ్మవారి లీలల్లో ఒకటిగా భావించినట్లు భక్తి భావం నిండిన కళ్లతో పూజారి తెలిపారు. అప్పటి నుంచి రంధ్రం ద్వారా నిరంతరాయంగా నీరు వస్తూనే ఉంది. ఆ వింతను కళ్లారా చూసేందుకు కాసేపు అక్కడే నిలుచున్నాము. విగ్రహం రంధ్రం నుంచి వెలువడిన పవిత్ర జలాన్ని తీర్థం రూపేణా పూజారి అందరికీ పంచి పెట్టాడు. కాసేపటికి రంధ్రంలో నీళ్లు మళ్ళీ చేరుకోవడం ప్రారంభమైంది

మంత్ర జలం వ్యవహారం ఆ నోటా ఈ నోటా వ్యాపించడంతో గ్రామీణ ప్రజలు తండోపతండాలుగా దేవాలయానికి చేరుకోసాగారు. జలాన్ని తాగడంతో తమ బాధలు, వ్యాధులు మటుమాయమైపోతాయని పల్లె ప్రజల విశ్వాసం. ఈ దేవాలయానికి సంబంధించి పలు విశ్వాసాలు గ్రామీణ ప్రజలలో వేళ్లూనుకున్నాయి. అమ్మవారి విగ్రహంతో పాటు బావి కూడా స్వయంభూగా ఆవిర్భవించాయని వారి నమ్మిక.
WD


తమ సమస్యలను తొలగించేందుకు మాత పూనుకుందని, అందుకనే ఆమె విగ్రహం నుంచి జలం ఉద్భవిస్తోందని కొందరు భక్తులు నమ్ముతున్నారు. వీరి సంగతి ఇలా ఉండగా, రాతి విగ్రహం భూమిలో పాతుకుపోవడంతో భూమి పొరలలో తలెత్తే భౌగోళిక మార్పుల ప్రభావం కారణంగా విగ్రహం నుంచి నీళ్లు ఊరుతున్నాయని మరి కొందరు కొట్టి పారేస్తున్నారు. ఈ సంఘటన గురించి మీరెమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాకు రాయండి...