శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2015 (09:46 IST)

నేడు మొహరం ఊరేగింపు... పాతబస్తీలో భారీ ఏర్పాట్లు.. ట్రాఫిక్ ఆంక్షలు

ముస్లిం సోదరుల పవిత్ర పండుగల్లో ఒకటైన మొహరం పండుగ శనివారం జరుగనుంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు భారీ ఊరేగింపును నిర్వహిస్తారు. ఈ ఊరేగింపునకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ వెల్లడించారు. ఇదే అంశంపై పలుమార్లు కమిషనర్‌ సమీక్ష సమావేశాలను నిర్వహించినట్టు తెలిపారు.
 
 
ఊరేగింపు జరిగే మార్గాల్లో రూ.1.5 కోట్లతో వివిధ పనుల్ని జీహెచ్‌ఎంసీ తరపున చేపట్టినట్లు వివరించారు. ఈ నెల 21వ తేదీ నుంచే ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్లపై వ్యర్థాల్ని, రాళ్లను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక మొబైల్‌ శానిటేషన్‌ బృందాల్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధాన ఊరేగింపు మార్గంలోని రహదారుల్ని శుభ్రం చేయడానికి ప్రత్యేక నీటి ట్యాంకర్లతో పాటు బ్లీచింగ్‌, లైమ్‌ పౌడర్‌ను అందుబాటులోకి ఉంచినట్లు చెప్పారు. చార్మినార్‌ సర్దార్‌మహల్‌లో జల మండలి, విద్యుత్‌, వైద్య, ఆరోగ్య, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామన్నారు.
 
ఇదిలావుండగా, మొహరం సందర్భంగా నగరంలోని పలుప్రాంతాల్లో శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించామని పోలీసు కమిషనర్ మహేందర్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పాతబస్తీ గుండా రాకపోకలు సాగించే వాహన చోదకులు, ఆర్టీసీ బస్సులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పాతబస్తీ నుంచి అలవాబీబీవైపు వచ్చే వాహనాలను సునార్‌గల్లీ టీజంక్షన్‌ మీదుగా డబీర్‌పురా దర్వాజా లేదా యాకుత్‌పురా నాలా మీదుగా పంపిస్తారు. 
 
షేక్‌ ఫయాజ్‌ కమాన్‌ వైపు వచ్చే వాహనచోదకులు జబ్బార్‌హోటల్‌ మీదుగా డబీర్‌పుర దర్వాజా, చంచల్‌గూడ మీదుగా వెళ్లాలి. యాకుత్‌పురా రైల్వేస్టేషన్‌ నుంచి వచ్చే వాహనాలు బడా బజార్‌ టీజంక్షన్‌ నుంచి రెయిన్‌ బజార్‌ లేదా తలాబ్‌కట్టా మీదుగా వెళ్లాలి. 
 
పురానీహవేలి నుంచి వూరేగింపు మార్గం గుండా వెళ్లే వాహనాలను ఐత్‌బార్‌చౌక్‌ మీదుగా పురానీ హవేలీ క్రాస్‌రోడ్స్‌ నుంచి పంపిస్తారు. 
 
ఊరేగింపు ఐత్‌బార్‌ చౌక్‌కు చేరుకోగానే.. మిట్టీకాషేర్‌ నుంచి వచ్చే వాహనాలను గుల్జార్‌హౌస్‌ మీదుగా మళ్లిస్తారు. అక్కడి నుంచి మదీనా క్రాస్‌రోడ్‌ లేదా చార్మినార్‌వైపు వెళ్లాలి. మొగల్‌పురా నీళ్ల ట్యాంకు నుంచి వచ్చే వాహనాలను హఫీజ్‌దంకా మసీదు నుంచి పంపిస్తారు. 
 
ఊరేగింపు అలిజా కోట్లకు చేరుకుంటుండగా.. హిమ్మత్‌పురా క్రాస్‌రోడ్స్‌ నుంచి వచ్చే వాహనాలను పంచ్‌మొహల్లా మీదుగా పంపుతారు. పురానాపూల్‌ నుంచి చార్మినార్‌ వైపు వచ్చే వాహనాలను అనుమతించబోరు. 
 
శక్కర్‌కోట్‌ నుంచి గుల్జార్‌ హౌస్‌వైపు వచ్చే వాహనాలు మోతీగల్లి మీదుగా మిట్టీకాషేర్‌ లేదా చౌమొహల్లా ప్యాలెస్‌ నుంచి వెళ్లాలి. గౌలిగూడ నుంచి అజీజ్‌ఖానా జోహ్రా మీదుగా సాలార్జంగ్‌ వంతెనపై వచ్చే వాహనాలు అఫ్జల్‌గంజ్‌ మీదుగా పంపుతారు. 
 
టీఎస్‌ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీ జిల్లా బస్సులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ గౌలిగూడ నుంచి రంగ్‌మహల్‌ రోడ్‌మీదుగా రాకపోకలు కొనసాగించాలి.
 
సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాలు... (సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8.30గంటలు) 
బషీర్‌బాగ్‌, హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా కర్బలామైదాన్‌ వైపు వచ్చే వాహనాలను అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న చిన్నపిల్లల పార్కు నుంచి కవాడిగూడ, బైబిల్‌హౌస్‌ మీదుగా పంపుతారు. 
 
రాష్ట్రపతి రోడ్‌ నుంచి కర్బలా మైదాన్‌ వైపు వచ్చే వాహన చోదకులు బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌ఠాణా నుంచి బైబిల్‌హౌస్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లాలి. 
 
మహాత్మాగాంధీ రహదారి మార్గంలోని సెంట్రల్‌ టెలిగ్రాఫ్‌ కార్యాలయం నుంచి రాణిగంజ్‌ వరకూ ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు.