అత్మలింగ సాక్షాత్కారం గోకర్ణం క్షేత్ర దర్శనం

Munibabu| Last Modified బుధవారం, 6 ఆగస్టు 2008 (15:39 IST)
కర్నాటక రాష్ట్రంలో వెలసిన గోకర్ణం క్షేత్రానికి విశేషమైన ప్రాశస్త్యం ఉంది. ఇక్కడున్న శివలింగాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడి ఆత్మలింగంగా పేర్కొంటారు. భారతదేశంలోని గొప్ప శైవ క్షేత్రాలైన కాశీ, రామేశ్వరం క్షేత్రాల తర్వాత గోకర్ణంకు అంతటి విశేష ప్రాధాన్యం ఉంది.

గోకర్ణం క్షేత్ర విశేషాలు
అరేబియా సముద్ర తీరాన వెలసిన ఈ శైవ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. ఇక్కడ వెలసిన శివుని మహాబలేశ్వరుడిగా పేర్కొంటారు. శివుడు ఇచ్చిన ఆత్మలింగం ఈ ప్రాంతంలో కూరుకుపోయినపుడు అతి బలవంతుడు, పరాక్రమశాలి అయిన రావణాసురుడు సైతం బయటకు తీయలేక పోయాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

అందుకే ఇక్కడున్న శివ లింగాన్ని మహాబలేశ్వరుడు పిలవడం జరుగుతోందని భక్తుల విశ్వాసం. శివలింగంలో కొంత భాగం భూమిలో చొచ్చుకుపోయి ఉండడం ఈ క్షేత్రంలోని మరో విశేషం. అలాగే ఇక్కడున్ని శివలింగాన్ని కప్పి రాళ్లు ఉంటాయి. ఈ రాళ్లలో పై భాగంలో ఉన్న రాయికి ఆవు చెవి ఆకారంలో ఓ పెద్ద రంధ్రం ఉంటుంది.

ఇలా రాయికి ఉన్న రంధ్రం వల్లే దీనికి గోకర్ణం అనే పేరు వచ్చినట్టుగా చెబుతారు. ఈ రంధ్రంలోంచి చేయి పెడితే లోపల ఉన్న శివలింగంలోని పై భాగం మనకు తగులుతుంది. అంతేకాకుండా ఈ రంధ్రం ద్వారా నీటిని పోస్తూ భక్తులే స్వయంగా శివునికి అభిషేకం చేయవచ్చు.
దీనిపై మరింత చదవండి :