ఆదిశంకరుడి శారద మఠం కొలువైన శృంగేరి

Munibabu| Last Modified గురువారం, 7 ఆగస్టు 2008 (15:10 IST)
అద్వైతాన్ని దేశ వ్యాప్తం చేయతలపెట్టిన ఆది శంకరాచార్యులు తన సంచారంలో భాగంగా నిర్మించిన నాలుగు మఠాల్లో మొదటిదైన శారద మఠం ఉన్న ప్రదేశమే శృంగేరి. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూర్ జిల్లాలో తుంగ నది ఒడ్డున నిర్మితమైన ఈ చారిత్రక ప్రదేశంలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి.

శృంగేరీలో ఉన్న ఈ శంకర మఠాన్ని అక్కడ దక్షిణామ్నాయ మఠం అని పిలుస్తుంటారు. అద్వైత ప్రచారంలో భాగంగా దేశ సంచారం చేస్తున్న సమయంలో తొలి మఠాన్ని ఇక్కడ స్థాపించేలా ఆది శంకరాచార్యను ప్రేరింపించిన ఈ శృంగేరి చారిత్రకంగా ఎంతో ప్రధాన్యం సంతరించుకుంది.

శృంగేరీ విశేషాలు
శంకరాచార్యులు ధర్మ ప్రచారంలో భాగంగా పర్యటన జరపుతూ శృంగేరీ చేరుకున్న సమయంలో ఇక్కడ ఆయన కంటపడిన రెండు సంఘటనలు ఆయనకు ఆశ్చర్యాన్ని కల్గించాయట. దాంతో ఆయన ఇక్కడే తొలి మఠాన్ని నిర్మించి దాదాపు 12 ఏళ్లపాటు ఇక్కడే గడిపారని స్థల చరిత్ర చెబుతోంది.

శృంగేరీలో తొలి మఠాన్ని స్థాపించిన తర్వాతే ఆదిశంకురులవారు పూరి, బదరి, కంచి, ద్వారకల్లో మఠాలను నిర్మించారని చరిత్ర చెబుతోంది.

శృంగేరీలోని వివిధ దర్శనీయ స్థలాలు

శృంగేరి శారదా పీఠం
ప్రారంభంలో చెప్పినట్టు ఆదిశంకరులు మొదట నిర్మించిన మఠమే ఈ శృంగేరి శారదా పీఠం. కృష్ణ యజుర్వేదం అనేది ఈ మఠానికి ప్రధాన వేదం. ఈ మఠానికి పీఠాధిపతిగా వ్యవహరించేవారిని ఆదిశంకరాచార్యులతో సమానంగా భావించి సేవిస్తారు.

శారదాంబ దేవాలయం
జ్ఞానానికి ప్రతినిధి అయిన సరస్వతీ దేవి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడున్న శారదాదేవి విగ్రహం గురించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. శంకరాచార్యుల వారి ప్రియతమ శిష్యుల్లో ఒకరైన మండన మిశ్రుని భార్య అయిన ఉదయ భారతి శారదాదేవి ఆలయంలోని విగ్రహంగా మారిపోయిందని చెప్పబడుతోంది. ఈ ఆలయాన్ని శారద పీఠాధిపతులు నిర్వహిస్తుంటారు.
దీనిపై మరింత చదవండి :