కలియుగ వైకుంఠం తిరుమల

Munibabu|
వేంకటేశ్వరుని దివ్వ సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం అణువణువునా కనిపించే భక్తి పారవశ్యం తిరుమల సొంతం. శ్రీమహావిష్ణువు చివరి అవతారమైన వేంకటేశ్వరుని అవతారంతో స్వామివారు తిరుమలలో కొలువుండడం ఈ పుణ్యక్షేత్రం ప్రత్యేకం.

ఏడుకొండలవాడిగా, వడ్డికాసుల వాడిగా, భక్తుల కొంగుబంగారమైన మలయప్ప స్వామిగా పలు పేర్లతో పిలవబడే తిరుమలలోని స్వామివారి ఆలయం చరిత్ర ప్రసిద్ధం. తిరుమల ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చరిత్ర పేర్కొంటోంది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఇలా అందరూ ఆ శ్రీవారి భక్తికి పాత్రులైనవారే.

ఈ రాజులందరూ తమ తమ పాలనా కాలంలో స్వామి వారికి విలువైన కానుకలను సమర్పించుకోవడం ద్వారా ఆ కలియుగ దైవం పట్ల తమ భక్తిని చాటుకున్నారు. అయితే పాతరోజులు సంగతి ఎలా ఉన్నా 19వ శతాబ్దం నుంచి తిరుమలకు కొత్త శోభ సంతరించుకోవడం ప్రారంభించింది. అప్పటివరకు హాథీరాంజీ మఠం నీడలో ఉన్న తిరుమల ఆలయానికి 1870లో తిరుమలకు కాలిబాట స్థానంలో మెట్లు నిర్మించడం జరిగింది.

తిరుమల అభివృద్ధిలో టీటీడీ పాత్ర
అంతేకాకుండా 1933లో టీటీడీ పాలకమండలి ఏర్పడడంతో తిరుమల సుప్రసిద్ధ ఆలయంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఈ సమయంలో తిరుమలకు ఘాట్ రోడ్డు నిర్మాణం పరిశీలనలోకి వచ్చింది. ఈ ప్రతిపాదన ఓ రూపు సంతరించుకుని 1944 నాటికి తిరుమలకు ఘాట్ రోడ్డు ఏర్పడింది. దీంతో గుర్రపుబండ్లు, ఎద్దుల బండ్లు ప్రయాణించే సౌకర్యం ఏర్పడడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది.

ఈ సమయంలో టీటీడీ తిరుమలకు బస్సులు సైతం ప్రారంభించడంతో భక్తుల రద్దీ తీవ్రమైంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 1974లో టీటీడీ రెండో ఘాట్ రోడ్‌ను ప్రారంభించింది. ఇదేతరుణంలో 1980లో టీటీడీ తిరుమలకు ఉన్న మెట్ల మార్గాన్ని మరింత పునరుద్ధరించి పైకప్పుతో పాటు కరెంటు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఇలా క్రమంగా అభివృద్ధి చెందిన తిరుమల నేడు ప్రపంచంలోనే అత్యధిక రద్దీ, అత్యధిక రాబడి కలిగిన పుణ్యక్షేత్రంగా పేరుతెచ్చుకుంది.
దీనిపై మరింత చదవండి :