క్షీర సాగర మధనంలో అమృత బిందువు ఒలికిందిక్కడే..!!

Haridwar
Ganesh|
PTI
క్షీర సాగర మధనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో ఒలికిందని పురాణాలు చెబుతున్నాయి. అలా అమృతం ఒలికిన నాలుగు ప్రదేశాలలో ఒకటి "హరిద్వార్". ఇది ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రమైన ఈ హరిద్వార్.. ఆ "శ్రీహరి"ని చేరుకునేందుకుగల "దారి"గా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. ఈ పరమ పవిత్ర ప్రదేశాన్ని ఓసారి దర్శిద్దామా..?!

భారతీయ సంప్రదాయానికి, నాగరికతకు ప్రతిబింబమైన హరిద్వార్‌ను శైవ మతస్తులు "హరద్వార్"గానూ.. వైష్ణవ మతస్థులు "హరిద్వార్"గానూ పిల్చుకుంటుంటారు. హరి అంటే "విష్ణువు" అనీ, హర "శివుడు" అని అర్థం. కాగా.. అమృత బిందువులు ఒలికిన నాలుగు ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి కాగా.. ప్రయాగ, ఉజ్జయినీ, గోదావరి నదీమతల్లి జన్మస్థలం అయిన నాసిక్‌లు మరో మూడు ప్రాంతాలు. ఇవి కూడా ప్రస్తుతం పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.

అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రాలలో అత్యంత భక్తి ప్రపత్తులతో కుంభమేళా నిర్వహిస్తుంటారు. 3 సంవత్సరాల వ్యవధికో ఒక్కొక్కొ క్షేత్రంలో కుంభమేళాను జరపటం ఇప్పటిదాకా ఆనవాయితీగా వస్తోంది. అదలా ఉంచితే.. ఉత్తరాఖాండ్ నైరుతీ భాగంలోని హరిద్వార్ నగర వైశాల్యాన్ని చూస్తే 2360 కిలోమీటర్లు. ఇది సముద్ర మట్టానికి 249.7 మీటర్ల ఎత్తులో, ఈశాన్య దిశగా శివాలిక్ కొండలకు దక్షిణంగా గంగానది మధ్యభాగంలో ఉంది.

హరిద్వార్‌లో దర్శనీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో హరి కీ పురి, చండీ దేవి, మానసాదేవి ఆలయం, మాయాదేవి ఆలయం, దక్ష మహాదేవ్ ఆలయం, నీల్ ధారా పక్షుల శరణాలయం, సతీకుండ్, భీమ్‌గోడా సరస్సు, జైరామ్ ఆశ్రమం, సప్తఋషి ఆశ్రమ్ మరియు సప్తఋషి కుండ్, పరాడ్ శివలింగం, దూధాధారి బర్ఫానీ ఆలయం, సురేశ్వరీ ఆలయం, పవన్ ధాం తదితర ప్రదేశాలు ముఖ్యమైనవి.

హరి కీ పురి స్నాన ఘట్టాన్ని.. విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తృహరి మరణానంతరం అతని జ్ఞాపకార్థంగా గంగానదీ తీరంలో కట్టించినట్లుగా చెబుతుంటారు. భర్తృహరి ఇదే ప్రదేశంలో తపస్సు చేసి, మరణించిన కారణంగా ఆయన పేరుతోనే ఈ నిర్మాణం చేపట్టిట్లు స్థానికుల కథనం. తరువాతి కాలంలో ఇదే "హరి కీ పురి"గా రూపాంతరం చెందగా.. దీన్నే "బ్రహ్మ కుండ్" అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ సాయంసమయాల్లో గంగాదేవికి హారతి ఇస్తుంటారు. అలాగే పితృదేవతల కోసం నదీ జలాలలో తేలిపోయే దీపాలను వదులుతుంటారు.


దీనిపై మరింత చదవండి :