తిరుక్కుర కుండ్రం "పక్షితీర్థం" అయ్యిందిలా...!!

Ganesh|
FILE
సరిగ్గా మధ్యాహ్నంపూట 12 గంటలకు ఒక పదిహేను నిమిషాలు ముందుగా ఒక అర్చకుడు చిన్న బిందె నిండుగా పరమాన్నం పట్టుకుని వస్తాడు. ఆలయానికి ఆనుకుని ఉండే దడి అవతల ఉండే విశాలమైన ఖాళీ స్థలం మధ్యలో తన పక్కన బిందె పెట్టుకుని కూర్చుంటాడు. పైన ఆకాశంలో కొన్ని పక్షులు ఎగురుతూ ఉంటాయి.

అర్చకుడు అవేమీ పట్టించుకోకుండా బిందెమీద ఉంచిన పళ్లాన్ని చేతిలోకి తీసుకుని చిన్న గరిటెతో శబ్దం చేస్తూ కూర్చుంటాడు. అంతే పై నుంచి రెండు పక్షులు వచ్చి ఆయన పక్కన వాలతాయి. ఆయన బిందెలో ఉన్న పరమాన్నంలోంచి రెండు టీస్పూన్లతోనూ తీసి ఆ పక్షుల ముందు ఉంచుతాడు. అవి ఆ పరమాన్నంలో రెండు, మూడుసార్లు ముక్కు ముంచి వెళ్లిపోతాయి.

అందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా...? ఇందులోనే అసలు విశేషమంతా ఉంది మరి. పైన చెప్పుకున్న పక్షులు కాశీ, రామేశ్వరం యాత్ర చేస్తూ, మధ్యలో పూజారి ఇచ్చిన పరమాన్నం రుచిచూసిన ప్రాంతంలో ఆగుతాయని అక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతం "పక్షితీర్థం"గా ప్రసిద్ధిగాంచింది.

ఈ పక్షితీర్థం చెన్నయ్ నగరానికి దక్షిణంగా చెంగల్పట్టు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వెళ్లే దారిలో ఉంటుంది. నిజానికి ఈ ఊరి అసలుపేరు "తిరుక్కుర కుండ్రం". ఇక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంటుందన్న విషయమే చాలా మందికి తెలియదు. ఈ ఆలయం ప్రాంగణంలోపల పెద్ద పుష్కరిణి కూడా ఉంటుంది.

ఈ ఆలయంలోని స్వామి పేరు "భక్తవత్సలేశ్వరుడు", అమ్మవారి పేరు "త్రిపురసుందరి". ఈ ఆలయంలోని శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. పక్షితీర్థం సందర్శించే యాత్రికులు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా చూసి తరించాల్సిందే. అదలా ఉంచితే... మహాబలిపురం సందర్శించేవారుగానీ, చెంగల్పట్టు నుంచి నేరుగా వచ్చేవారుగానీ ఉదయం 11 గంటలలోపు ఈ పక్షితీర్థానికి చేరుకోవాల్సి ఉంటుంది.

పక్షితీర్థం ఊరి మధ్యలో ఉన్న మెయిన్‌రోడ్డును ఆనుకుని ఒక కొండ ఉంటుంది. ఈ కొండమీదకే పక్షులు వస్తుంటాయి. సుమారు 500 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండను వేదగిరి అని పిలుస్తుంటారు. కొండమీద వేదగిరీశ్వరాలయం అనే పేరుతో ఒక శివాలయం ఉంటుంది. కాగా.. ఇక్కడి అమ్మవారిని చుక్కాలమ్మగా స్థానికులు కొలుస్తుంటారు.

వేదగిరిపైన వేదగిరీశ్వరాలయం మినహా మరేమీ ఉండదు. ఈ ఆలయాన్ని పదిగంటల తరువాత తెరుస్తారు. ఇక్కడి స్వామివారికి, అమ్మవారికి నిత్యపూజలు అయిన తరువాతే అర్చకుడు ప్రసాదాన్ని బిందె నిండా నింపుకుని గుడికి ఆనుకుని ఉండే దడికి అవతల కూర్చుని, పై నుంచి వచ్చే రెండు పక్షులకూ ప్రసాదాన్ని ఇచ్చే దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు, భక్తులు దడికి అవతల నిలబడి తదేకంగా చూస్తూంటారు. పక్షులు ప్రసాదాన్ని తిని వెళ్తున్న దృశ్యాన్ని కళ్లారా చూసిన వారు దేవుడి మహిమవల్లనే ఇలా జరుగుతోందంటూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో కీర్తిస్తారు.

రెండు పక్షులు వచ్చి ప్రసాదాన్ని తిని వెళ్లిన తరువాత.. ఆ అర్చకుడు ఆ ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు, సందర్శకులకు ఒక్కో టీస్పూన్ చొప్పున 5 రూపాయల రుసుమును వసూలు చేసి మరీ పంచుతాడు. అయితే ఆ పక్షులు ప్రతిరోజూ సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకే వస్తాయని చెప్పలేం. ఒక్కోరోజు అసలు రాకపోవచ్చును కూడా..! కాబట్టి పక్షితీర్థం వెళ్లదల్చుకునేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకుని వెళ్ళాల్సి ఉంటుంది.


దీనిపై మరింత చదవండి :