త్రికూట కొండలపై కొలువైన "వైష్ణోదేవి"

FILE
భారతదేశంలోని అద్భుతమైన ఆలయాలలో వైష్ణోదేవి ఆలయం కూడా ఒకటి. ఇది జమ్మూలోని రియాసీ జిల్లాలో త్రికూట కొండలపైన వెలసిన సుప్రసిద్ధ శక్తి పీఠం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే... ముందుగా జమ్మూ, అక్కడి నుంచి ఉత్తరంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రా అనే చిన్న పట్టణానికి చేరుకోవాలి.

కాట్రా పట్టణానికి బయటినుంచే హిమాలయా పర్వత శ్రేణులు ప్రారంభం అవుతాయి. అందులో పట్టణానికి ఆనుకుని ఉన్న ఓ కొండమీదనే వైష్ణోదేవి ఆలయం ఉంటుంది. జమ్మూ నుంచి కాట్రా వెళ్లేందుకు బస్సులు, ట్యాక్సీలు కోకొల్లలుగా ఉంటాయి. కాట్రా పట్టణంలో యాత్రికుల కోసం హోటళ్లు, లాడ్జీలు కూడా అనేకం ఉంటాయి.

వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేదారి కాట్రాకు పూర్తిగా అవతల ఉండే కొండమీద నుంచి ప్రారంభమవుతుంది. అక్కడే ఒక బస్టాండ్ కూడా ఉంటుంది. ఈ బస్టాండును ఆనుకునే దేవస్థానంవారు నిర్వహించే నీహారిక అనే పెద్ద వసతి గృహం కూడా ఉంది. కొండమీది ఆలయానికి వెళ్లేందుకు ఇక్కడ ఓ చక్కటి పద్ధతి ఉంటుంది. అదేంటంటే...

చూసేందుకు అచ్చం మన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గ ఆలయంలాగే ఉండే వైష్ణోదేవి ఆలయం... నిట్టనిలువుగా ఉన్న ఓ కొండకు సరిగ్గా మధ్యభాగంలో ఒక గుహ ఉంటుంది. అందులో అమ్మవారి ఆలయం ఉంటుంది. అందువల్ల కొండ అంచు వెంబడే సుమారు 200 మీటర్ల పొడవునా రోడ్డు మార్గం నిర్మించారు.

ఈ రోడ్డు సగభాగం క్యూలైన్ కోసం ఏర్పాటు చేసిన తీగలతో అడ్డుగా ఉంటుంది. ఆలయం ఉండే కొండమీదకు చేరిన తరువాత ఈ మార్గం వెంబడే వెళ్లి గుహలో ఉండే అమ్మవారిని దర్శనం చేసుకుని, తిరిగీ అదే మార్గం వెంట వెనుకకు మరలాల్సి ఉంటుంది. అందువల్ల కొండమీద ఉండే ఈ ఆలయం వద్ద ఒకేసారి వెయ్యి లేదా పదిహేను వందల మందికి మించి ఉండేందుకు సాధ్యంకాదు. కాబట్టి భక్తుల సంఖ్యను కాట్రాలోనే నియంత్రిస్తారు.

ఈ ఆలయంలోకి సెల్‌ఫోన్లు, కెమెరాలు, సిగరెట్లు, అగ్గిపెట్టె, బాల్‌పాయింట్ పెన్నులను అనుమతించరు. కాట్రా నుంచి కొండమీది ఆలయానికి మధ్యనుండే 12 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిగా సిమెంటు రోడ్ మీద వెళుతున్నట్లుగానే ఉంటుంది. ఐదేళ్ల పిల్లలు కూడా సులభంగా నడిచి వెళ్లి వస్తుంటారు. నడవలేని వారికి డోలీలు, గుర్రాలు ఉండనే ఉంటాయి. అన్నట్టు.. కాట్రా నుంచి కొండమీదకు హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది సుమా...!

కొండమీద నెలవైన వైష్ణోదేవి అమ్మవారి ఆలయం ఉండే ప్రదేశం అద్భుతమైన సౌందర్యంతో మనకు ఆహ్వానం పలుకుతుంది. అమ్మవారి గర్భగుడి మాత్రం గుహ లోపల ఉంటుంది. గతంలో గర్భగుడిదాకా గుహ లోపల సుమారు 90 అడుగుల పొడవున ఓ ఇరుకైన సొరంగ మార్గం ఉండేది. అందులో పాకుతూ వెళ్లాల్సి ఉండేది. అయితే ఇప్పుడలా కాకుండా, దాని పక్కనే విశాలమైన సొరంగం నిర్మించి, అందులో లైట్లు, ఫ్యాన్లు వేశారు.

Ganesh|
ఇక చివరగా చెప్పుకోవాల్సి ఏంటంటే... వైష్ణోదేవి ఆలయంలోని గర్భగుడిలో ఒక పీటమీద సరస్వతీ దేవి, లక్ష్మీదేవి, కాళికాదేవి అనే ముగ్గురు అమ్మవార్ల మూర్తులు ఉంటాయి. అయితే అమ్మవార్లను దర్శించుకునేందుకు మనలను అక్కడ కొన్ని క్షణాలపాటు మాత్రమే నిల్చోనిస్తారు కాబట్టి.. ఏ మాత్రం జాగు చేయకుండా, అమ్మవార్ల మూర్తులను దర్శించుకుని వచ్చేయాలి.


దీనిపై మరింత చదవండి :