నందులు పరిపాలించిన ప్రాంతం నాందేడ్

Pavan Kumar| Last Modified గురువారం, 19 జూన్ 2008 (19:27 IST)
పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉంది నాందేడ్. నాందేడ్ నందులు పరిపాలించారని అంటారు. మరఠ్వాడా ప్రాంతంలో రెండో అతిపెద్ద నగరం నాందేడ్. సిక్కులకు ఇది పవిత్ర ప్రదేశం. వనవాస కాలంలో శ్రీరాముడు ఇక్కడ కొన్నాళ్లు గడిపారని అంటారు. మహారుషి వాల్మీకి, మహాకవి కాళిదాసు, భవభూతి వంటివారు తమ రచనల్లో నాందేడ్ గురించి ప్రస్తావించారు. విదేశీ పర్యాటకుడు టోలమీ తన గ్రంధంలో సైతం నాందేడ్ ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లిందని వివరించారు.

నాందేడ్ గురించి పురాణాలలో ప్రస్తావించటం జరిగింది. పాండవులు ఈ ప్రాంతంలో సంచరించారని అంటారు. నాందేడ్‌కు పూర్వ నామధేయం నందితత్. శాతవాహనుల ప్రాంతంలోనిది నాందేడ్ అని చరిత్రకారులు పేర్కొన్నారు. చాళుక్య వంశ రాజు నందదేవుడు నాందేడ్ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులతో పాటుదా దేవగిరి యాదవ రాజులు నాందేడ్‌ను తమ రాజ్యంలో భాగంగా అభివృద్ధి చేశారు. బహమనీ సుల్తానుల కాలంలో తెలంగాణా సుభా కింద నాందేడ్ ఉండేది.

మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబు కాలంలో సిక్కు మత గురువు గురు గోబింద్ సింగ్ నాందేడ్ సందర్శించారని అంటారు. గురు గోబింద్ సింగ్ తన ప్రాణాలను ఇక్కడే వదలటంతో సిక్కులు పవిత్ర గురుద్వారాను ఏర్పాటుచేసుకున్నారు. ఈ గురుద్వారా నిర్మాణానికి మహారాణా రంజిత్ సింగ్ ఆర్ధిక సాయం అందించారు.


దీనిపై మరింత చదవండి :