నమ్మిన నా మది "మంత్రాలయమేగా"

FILE

"నమ్మిన నా మది మంత్రాలయమేగా... ఓఓ, నమ్మని వారికి తాపత్రయమేగా... శ్రీగురు బోధలు అమృతమయమేగా... ఓఓ, చల్లని చూపుల సూర్యోదయమేగా గురునాథ రాఘవేంద్రా శ్రీకృష్ణ పారిజాత".... కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించేందుకు దైవసంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. ఈయన శ్రీహరి భక్తుడు. ఈయన కొలువై ఉన్న ప్రాంతమే "మంత్రాలయం". మంత్రాలయం అసలు పేరు "మాంచాలే".

రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రను చూస్తే... ఆయన అసలు పేరు వెంకటనాథుడు. సతీమణి సరస్వతి, కుమారుడు లక్ష్మీనారాయణలతో జీవనం సాగిస్తుండేవారు. ఈయన గురువు "గురు సుధీంద్ర తీర్థ". శిష్యుడిపైన వల్లమాలిన ప్రేమానురాగాలను కనబర్చే గురు సుధీంద్ర తన తదనానంతరం పీఠం బాధ్యతలను స్వీకరించమని వెంకటనాథుని ఆదేశించారు.

అయితే గురువు ఆదేశించినట్లుగా, గురు స్థానాన్ని చేపట్టాలంటే గృహస్థు జీవితాన్ని వదులుకోవాల్సి వస్తుందనీ.. అలా చేస్తే గృహస్థుగా తన బాధ్యతలకు పూర్తి న్యాయం చేయలేనన్న కారణంతో గురు ఆజ్ఞను వినయంగానే తిరస్కరించారు వెంకటనాథుడు. కానీ కాలక్రమంలో దైవ సంకల్పంతో ఆయన సన్యాసాన్ని స్వీకరించి, గురు పీఠ స్థానాన్ని చేపట్టారు. అప్పటి నుంచి గురు రాఘవేంద్రుడిగా ప్రసిద్ధుడయ్యారు.

గురు రాఘవేంద్రుడు తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీహరి మహత్మ్యాన్ని ప్రవచించి, విస్తృతి చేశారు. శ్రీహరి కృపవల్ల ఆయన నయంకాని చాలా రోగాలను నయం చేయడం, మరణించిన వారిని బ్రతికించటం, నిరక్షరాస్యుడైన వెంకన్నను పండితుడిగా చేయటం లాంటి ఎన్నో మహిమలను ప్రదర్శించారు.

అలాంటి వాటిలో బాగా చెప్పుకోదగ్గది, ఆదోని రాజు సిద్ది మసూద్ ఖాన్ గర్వాన్ని అణచడం. స్వామిని అవమానించాలనే ఉద్దేశ్యంతో సిద్ది మసూద్ ఖాన్ పంపిన మాంసంతో కూడిన తినుబండారాలను స్వామి పళ్ళుగా మార్చడంతో... ఖాన్ రాఘవేంద్ర స్వామి శరణు వేడి వెంటనే ఒక అత్యంత సస్యశ్యామలమైన జాగీరుని స్వామికి సమర్పించాడు. స్వామి నవ్వుతూ.. జాగీరుని తిరస్కరించి తను తుంగభద్రా నదికి తల్లిగా భావించే మంత్రాలయాన్ని మాత్రం స్వీకరించారు.

మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నదీమతల్లి ఒడ్డున నెలకొని ఉంది. మద్రాసు, ముంబై, బెంగుళూరు, హైదరాబాదు మొదలుకొని పలు ప్రాంతాలనుండి మంత్రాలయానికి బస్సు సౌకర్యం ఉంది. మద్రాసు నుండి 595 కిలోమీటర్లు, ముంబై నుండి 690 కిలో మీటర్లు, హైదరాబాదునుండి 360 కిలోమీటర్ల దూరంలో మంత్రాలయం ఉంది. ఇక్కడ యాత్రికులు బస చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

ముంబై- మద్రాస్, డిల్లీ-బెంగుళూరు, హైదరాబాదు-తిరుపతి వెళ్ళే రైలు మార్గంలో మంత్రాలయం ఉంది. ఆ స్టేషన్ పేరు "మంత్రాలయం రోడ్డు". రైల్వే స్టేషన్ నుండి మంత్రాలయం 16కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడినుండి ప్రైవేటు జీపులు, ఆటోల లాంటి ప్రైవేటు వాహనాల సాయంతో మంత్రాలయానికి సులువుగా చేరుకోవచ్చు.
సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి మద్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య దేవాలయాన్ని దర్శించవచ్చు. ఇటీవలి కాలంలో దేవాలయానికి లభించిన "బంగారు రథం" ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. వెండి, మామూలు రథాలు దేవాలయంలో ఉన్నా బంగారు రథం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం కన్నుల పండువగా ఉంటుంది.

దేశంలోని పలు ప్రాంతాలనుండి భక్తులు మంత్రాలయానికి వస్తుంటారు. యాత్రికులను ఇంతగా ఆకర్షిస్తున్న ఈ దేవాలయం మూడువందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది.

మంత్రాలయంలోని ఇతర దర్శనీయ స్థలాలు :

రాఘవేంద్ర స్వామి బృందావనం : రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి పొందిన స్థలం. శ్రీ గురు సార్వభౌమ విద్యా పీఠం. ఇది ఒక సంస్కృత విద్యా పీఠం. ఇది శ్రీ రాఘవేంద్ర బృందావనం వెనకవైపు ఉంది. ఇక్కడి గ్రంధాలయంలో సంస్కృత పలు రచనలు, ప్రాచీన కాలం మెదలుకొని ఆధునిక కాలం వరకు రచనలు లభ్యమౌతాయి.

మాంచాలమ్మ దేవాలయం : పార్వతి దేవి ఇక్కడ మాంచాలమ్మగా కొలవబడుతుంది. రాఘవేంద్ర బృందావనానికి వెళ్ళకముందు మాంచాలమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ.

శ్రీ వేంకటేశ్వర దేవాలయం : మంత్రాలయం క్యాంపస్‌లో శ్రీ వేంకటేశ్వర దేవాలయం దర్శించుకోదగిన మరో స్ధలం. ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏమిటంటే గుడిలోని వేంకటేశ్వరస్వామి మూర్తిని స్వయంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతిష్టించడం.

శివలింగం : తుంగభద్రా నది మద్యలో నిర్మించిన మంటపంలోని పెద్ద శివలింగం కన్నుల పండువగా ఉంటుంది.

Ganesh|
పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం : మంత్రాలయం నుండి 5 కిలో మీటర్ల దూరంలో పంచముఖి ఆంజనేయ స్వామి కోవెల ఉంది. ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో ఉండటం. ఈ దేవాలయంలోని ఆంజనేయ స్వామి చాలా మహిమగలవాడని ప్రతీతి.


దీనిపై మరింత చదవండి :