పద్మనాభుడు కొలువైన తిరువనంతపురం

Munibabu| Last Modified శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (19:24 IST)
కొబ్బరి తోటలకు ప్రముఖమైన కేరళ రాష్ట్రంలో ఎన్నో సాంప్రదాయక విశేషాలు కలవు. ఇందులో పురాతన దేవాలయాలు సైతం స్థానాన్ని సంపాదించాయి. అలా కేరళలో అత్యంత ప్రాచూర్యం పొందిన దేవాలయాల్లో అనంత పద్మనాభుని క్షేత్రం ఒకటి.

కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో వెలసిన ఈ క్షేత్రం అత్యంత సాంప్రదాయబద్ధమైన హిందూ దేవాలయంగా విలసిల్లుతోంది. శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభుని రూపంలో కొలువైన ఈ క్షేత్రానికి సంబంధించి అనేక విశేషాలున్నాయి.

స్ధల పురాణం
కలియుగ ప్రారంభంలో దివాకరముని అనే ఓ రుషి మహావిష్ణువును కోరి తపస్సు ఆచరించాడు. దివాకరుని తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ఓ బాలుని రూపంలో ఆయన ఎదుట ప్రత్యక్షమైనాడు. ఆ బాలుని రూపం చూచి తన్మయత్వుడైన దివాకరుడు ఆ బాలున్ని తనతోనే ఉండిపొమ్మని ప్రార్ధించాడు.

అలా దివాకరుని వద్దకు చేరిన ఆ బాలుడు తన చేష్టలతో ఒక్కోసారి దివాకరునికి కోపం తెప్పించేవాడు. అలా ఓ రోజు ఆ బాలునిపై కోపం రావడంతో దివాకరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో కలత చెందిన ఆ బాలుడు ఇకపై తనను చూడాలనిపిస్తే అరణ్యంలోకి రావాల్సిందిగా తెలిపి అదృశ్యమై పోయాడు.

అదృశ్యమైన బాలునికోసం దివాకరుడు అన్వేషణ సాగించగా ఆయన కోరిక మన్మించి మహా విష్ణవు విగ్రహ రూపుడై కన్పించాడు. అలా దొరికిన ఆ విగ్రహాన్ని దివాకరుడు తిరువనంతపురంలో ప్రతిష్టించాడు.

ఆలయ విశేషాలు
దాదాపు ఐదో శతాబ్ధంలో నిర్మించినట్టుగా చెప్పబడుతోన్న ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు కన్పిస్తాయి. ఆలయ నిర్మాణం పూర్తిగా కేరళ సాంప్రదాయ పద్ధతిలో జరగడం విశేషం. దాదాపు ఏడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడిన ఈ ఆలయ ప్రాంగణం నాలుగు ముఖ ద్వారాలతో నిర్మించబడింది.

ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడ్డ కోనేరు ఎంతో విశిష్టతను సంపాదించుకుంది. ఆలయం లోపల అయ్యప్ప, పార్థసారధి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతించడం ఓ విశేషం. అలాగే ఈ ఆలయంలోకి ప్రవేశించే వారెవరైనా సరే సాంప్రదాయ దుస్తులు ధరించి తీరాల్సిందే.


దీనిపై మరింత చదవండి :