బ్రహ్మ యజ్ఞం నిర్వహించిన ప్రాంతం పుష్కర్

Pavan Kumar| Last Modified శనివారం, 31 మే 2008 (19:16 IST)
భూమి మీదకి తామరపువ్వుతో పాటుగా హంసను దేవతలు పంపించిన ప్రాంతం పుష్కర్. ఆ ప్రాంతంలో సృష్టికర్త బ్రహ్మ యజ్ఞం నిర్వహించటంతో హిందువులు పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. పుష్కర్‌ను తీర్ధ రాజ్‌గా కూడా పిలుస్తారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 146 కి.మీ. దూరంలో ఉంది పుష్కర్. అజ్మీర్‌కు 14 కి.మీ. దూరంలో పుష్కర్ పుణ్యక్షేత్రం ఉంది. పుష్కర్ క్షేత్రం పుష్కర్ సరస్సు ఒడ్డున ఉంది. ఈ సరస్సులో పుణ్యస్నానం ఆచరించటానికి 52 ఘాట్లను ఏర్పాటుచేశారు.

పుష్కర్ అతి ప్రాచీన నగరం. అయితే నగరాన్ని ఎప్పుడు నిర్మించారనే దానిపై చారిత్రక ఆధారాలు లేవు. బ్రహ్మ సృష్టిలో భాగంగా ఈ నగరం ఏర్పడిందని అంటారు. రామాయణంలో పుష్కర్ గురించి వివరించారు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఇక్కడ తపస్సు చేశాడని అంటారు.

ఇంద్రలోక తార మేనక ఇక్కడకు వచ్చి పుష్కర్ సరస్సులో స్నానం చేసిందని అంటుంటారు. మహాభారతంలో పాండవాగ్రజుడు ధర్మరాజు సింథ్ ప్రాంతం నుంచి వచ్చినపుడు ఇక్కడి సరస్సులో పుణ్యస్నానం మాచరించాడని అంటారు.

జోధ్‌పూర్ సమీపంలోని మండోర్ రాజధానిగా చేసుకుని పరిపాలించే ప్రతీహార వంశ రాజు నహదారవ ఏడో శతాబ్దంలో పుష్కర తీర్ధాన్ని పునరుద్ధరించాడని అంటారు. పుష్కర్ సరస్సులోకి నీటిని తెచ్చే లూని నది గట్లను పటిష్టం చేయడంతో పాటుగా, ఇక్కడ పురాతన భవంతుల పునరుద్ధరణ, 12 ధర్మశాలలను నిర్మించాడు. సరస్సుకు మూడు వైపులా స్నాన ఘట్టాలను ఏర్పాటుచేశాడు.

పుష్కర్‌లో ప్రధానంగా ఐదు దేవాలయాలు ఉన్నాయి. ఇందులో సృష్టికర్త బ్రహ్మ దేవుడి కోసం 14వ శతాబ్దంలో కట్టించిన దేవాలయం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మదేవుడికి నాలుగు చోట్ల దేవాలయాలు ఉన్నాయి. అవి ఉత్తర ప్రదేశ్ బిత్తోర్ సమీపంలోని బాలిలో గల బేసకీహ్, రాజస్థాన్ బార్మర్ జిల్లా బలోత్రా నగరానికి సమీపంలోని ఆసోత్రా, ఇండోనేషియాలోని ప్రాంబనాన్‌లలో ఉన్నాయి. వీటితోపాటుగా పుష్కర్ ఒకటి.

పుష్కర్‌లో ప్రతి ఏడాది పుష్కర్ ఒంటెల ఉత్సవం నిర్వహిస్తారు. ఈ పోటీలను తిలకించటానికి దేశవిదేశీ యాత్రీకులు, పర్యాటకులు ఇక్కడకు వస్తారు.


వసతి
ప్రభుత్వ, ప్రైవేటు వసతి సదుపాయాలు అజ్మీర్, పుష్కర్‌లలో ఉన్నాయి. పుష్కర్‌లో అనేక ధర్మశాలలు కూడా ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : జైపూర్ (146 కి.మీ.)

రైలు మార్గం : అజ్మీర్ సమీపంలోని రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి అన్నిచోట్లకు రైళ్లు ఉన్నాయి.

రహదారి మార్గం : అజ్మీర్ సమీపంలోని నగరం. ఇక్కడినుంచి అన్నిచోట్లకు బస్సు సౌకర్యం ఉంది.


దీనిపై మరింత చదవండి :