భక్తులకు ఇలవేల్పు భద్రాద్రి

Gayathri|
గోదావరి నది ఒడ్డున వెలసిన సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయం భక్తులకు ఇలవేల్పు. దక్షిణ భారతంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన భద్రాద్రిలో ప్రతిఏటా శ్రీరామ నవమినాడు కన్నులపండువగా ఉత్సవాలు నిర్వహిస్తారు. రామదాసుగా పిలువబడే కంచెర్ల గోపన్న ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో నిర్మించాడు.

ఆలయ నిర్మాణం:
పదిహేడవ శతాబ్దంలో తానీషా గోల్కొండను పాలిస్తుండేవాడు. ఆయన వద్ద గోపన్న మేనమామలైన అక్కన్న, మాదన్నలు మంత్రులుగా ఉండేవారు. ఆ తర్వాత గోపన్నను తహసీల్దారు పదవిని ఇచ్చారు. శ్రీరామచంద్రునిపై అపార భక్తి చేత ఆయన వసూలు చేసిన ప్రజల సొమ్ముతో భద్రాచలంలో స్వామివారికి ఆలయం కట్టించాడు.

ఈ విషయం తెలిసిన తానీషా గోపన్నను చెరలో బంధించాడు. ఆ సమయంలో ఆయన రామునిపై అనేక కీర్తనలు రాశాడు. భక్తుని కాపాడేందుకు స్వయంగా శ్రీరామచంద్రుడు దిగివచ్చి రుసుమును చెల్లించి గోపన్నను విడుదల చేయించాడు. అప్పట్నుంచీ ఆయనకు భక్త రామదాసు అన్న నామధేయం సార్థకమైంది.

స్థల పురాణం :
పూర్వం భద్రుడు చేసిన తపస్సు కోరిక మేరకు రాములవారు సతీసమేతంగా భద్రాద్రిలో వెలిశారని పురాణ కథలు చెబుతున్నాయి. మరో కథ ఏమంటే కైకేయి కోరిక మేరకు వనవాసానికి బయలుదేరిన సీతారాములు ఈ ప్రాంతంలోనే పర్ణశాల నిర్మించుకుని నివసించినట్టుగా ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమినాడు స్వామి వారికి కల్యాణ మహోత్సవాలు అతి వైభవంగా భద్రాద్రిలో జరుగుతాయి.


దీనిపై మరింత చదవండి :