భక్తుల కొంగు బంగారం... చిలుకూరు బాలాజీ

Munibabu|
రంగారెడ్డి జిల్లా మొయినా‌బాద్ మండలంలోని చిలుకూరులో సతీ సమేతంగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు బాలాజీ పేరుతో భక్తుల కొంగు బంగారంగా సేవలందుకుంటున్నాడు. తెలంగాణా బాలాజీగా, వీసా బాలాజీగా పలు పేర్లతో పిలవబడే ఈ చిలకూరి బాలాజీ ప్రాశస్త్యం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఏదైనా కోర్కెతో చిలుకూరు బాలాజీని దర్శించి 11 ప్రదర్శనలు చేస్తే కోరుకున్న కోర్కెలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ క్షేత్రం మాత్రం ఇప్పటికీ కాస్త సాదా సీదాగానే కన్పించడం విశేషం.

ఈ చిలుకూరి బాలాజీ ఆలయ నిర్వహణను చేపట్టిన ట్రస్టీలు ఎలాంటి ఆదాయం కోసం ఎదురు చూడకుండా కేవలం కొంతమంది దాతల విరాళాల ద్వారానే ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో హుండీ అన్నదే లేకపోవడం కూడా ఈ ఆలయ విశేషంగా చెప్పవచ్చు.

క్షేత్ర పురాణం
ఈ చిలుకూరు బాలాజీ ఇక్కడ కొలువైన విధానం గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకానొక కాలంలో వెంకటేశ్వరస్వామి వారి భక్తుడైన ఓ వ్యక్తి ప్రతి ఏడు క్రమం తప్పకుండా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించి వచ్చేవారట. అయితే కొంతకాలానికి ఆయన జబ్బు పడి తిరుమల వెళ్లే వీలులేకుండా పోయిందట.

దీంతో ఆయన బాధపడుతుండగా కలలో కన్పించిన వెంకటేశ్వరుడు నీ చెంతనే నేను ఉన్నానంటూ పలికాడట. ఇలా కలలో కన్పించి దేవుడు చెప్పిన ప్రదేశంలో తవ్వగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వరుడు దర్శనమిచ్చాడట. దీంతో ఆ భక్తుడు అక్కడ ఓ ఆలయాన్ని కట్టించి తన భక్తిని నిరూపించుకున్నాడట.

ఆలయ విశేషాలు
చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులు ఓ ఆనవాయితీ పాటిస్తుంటారు. ఎదైనా కోర్కెతో స్వామివారి చెంతకు వచ్చినవారు తమ కోర్కెను స్వామి వారికి నివేదించి అటుపై 11 ప్రదక్షణలు చేస్తారు. అటుపై తమ కోర్కె నెరవేరితే మళ్లీ వచ్చి 108 ప్రదక్షణలు జరుపుతారు. అలాగే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకునే సమయంలో గానీ, ప్రార్ధించే సమయంలో గానీ కనులు మూసుకోకూడదనే ఆనవాయితీ కూడా అమలులో ఉండడం విశేషం.


దీనిపై మరింత చదవండి :