మమ్మేల రావయ్యా.. శ్రీశైల మల్లయ్యా..!!

Lord Shiva
Ganesh|
FILE
కేదారంలో స్నానం చేసినా, కాశీలో మరణించినా పునర్జన్మ ఉండదంటారు. అలాంటిది శ్రీశైల శిఖర దర్శన యాత్రతోనే ముక్తి కలుగుతుందని ప్రతీతి. అందుకే "స్పర్శవేదుల రాశి ప్రత్యక్ష రాశి" అని పేరు పొందిన శ్రీశైల యాత్రకు, శిఖర దర్శనానికి భక్తులు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. ఎన్నిసార్లు చూసినా తనివితీరని ఈ దివ్య పుణ్యక్షేత్రాన్ని దర్శించి భక్తిభావంతో పులకించి పోతుంటారు.

దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీ గిరి, శ్రీ పర్వతం, శ్రీ నగరం అని కూడా పిలుస్తుంటారు. శ్రీశైల శిఖరంమీద మల్లికార్జున స్వామి స్వయంభూ లింగమై వెలిశాడు. భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల మల్లికార్జున లింగం ఒకటి. అలాగే దేశంలో ఉన్న అష్టాదశ మహాశక్తి పీఠాలలో శ్రీశైల భ్రమరాంబికా శక్తి పీఠం రెండవదిగా పేరుగాంచింది.

ఆంధ్రరాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోగల నల్లమల అడవుల మధ్యన విరాజిల్లుతోంది శ్రీశైల క్షేత్రం. పరమపావనమైన కృష్ణానదీమతల్లి తీరంలో సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ దివ్యక్షేత్రం. ఈ శ్రీశైల శిఖరం సముద్ర మట్టానికి 2830 అడుగుల ఎత్తులో ఉంది. కాగా.. శ్రీశైల స్వామి దర్శనం, శిఖర సౌందర్యం, శ్రీశైలం నలుపక్కలా పరుచుకొని ఉన్న ప్రకృతి రమణీయత యాత్రికులను అలౌకిక ఆనందంలో ముంచెత్తి వేస్తాయనటంలో ఆశ్చర్యం లేదు.
స్వామీ.. నన్ను పర్వత శిఖరంగా మార్చు..!
పర్వతుడు కూడా తపస్సు చేసి శివుడిని సాక్షాత్కరింప జేసుకున్నాడట. అప్పుడు "స్వామీ.. నన్నిలా ఉన్నట్లుగానే ఒక కొండగా చేసి, ఆ పర్వత శిఖరంపై దివ్య లింగాకారంలో నువ్వు నివసించు తండ్రీ.." అని కోరుకున్నాడట...


శ్రీశైల ప్రసక్తి స్కంధ పురాణంలోనూ, మహా భారతం వన పర్వంలోనూ ఉంది. శ్రీరామ చంద్రుడు వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతుడై శ్రీశైలం వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పాండవులు కూడా శ్రీశైల స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపించినట్లు వాటి ద్వారా తెలుస్తోంది.

బౌద్ధయుగంలో కూడా శ్రీశైల ప్రసక్తి ఉన్నట్లు మహాయానానికి పూర్వంనుంచీ ప్రచారంలో ఉంది. చైనా యాత్రికులు ఫాహియాన్, హుయాన్‌త్సాంగ్‌లు తమ పర్యటనా అనుభవాలలో శ్రీశైలాన్ని గురించి కూడా పేర్కొన్నారు. పూర్వపు రాజులలో చాలామంది మల్లికార్జునస్వామి వారికి తమవంతుగా సేవగా యథాశక్తి శ్రీశైల అభివృద్ధికి కృషి చేసినట్లు తెలుస్తోంది.

శ్రీ కృష్ణ దేవరాయలు శ్రీశైల ఆలయాన్ని సందర్శించి రథోత్సవం జరిగే వీధిలో ఇరువైపులా ఎన్నో మందిరాలను కూడా కట్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఒక గోపురాన్ని నిర్మించినట్లు కథనం. అలాగే శ్రీ శంకరాచార్యులవారు శ్రీశైలంలో ఉండి కొన్ని రోజులపాటు తపస్సు చేసినట్లు చెబుతుంటారు. ఇక్కడే ఆయన భ్రమరాంబికా అష్టకాన్ని, శివానందలహరిని కూడా రాసినట్లు తెలుస్తోంది.

శ్రీశైల మల్లికార్జునుడి ఆవిర్భావం గురించి స్కంద పురాణంలోని ఓ కథ ఇలా చెబుతుంది. పూర్వం శిలానందుడనే మహర్షి పరమశివుడి గురించి తపస్సు చేసి, వరప్రసాదంగా నందీశ్వరుడు, పర్వతుడనే ఇద్దరు కుమారులను పొందాడట. పర్వతుడు కూడా తపస్సు చేసి శివుడిని సాక్షాత్కరింప జేసుకున్నాడట. అప్పుడు "స్వామీ.. నన్నిలా ఉన్నట్లుగానే ఒక కొండగా చేసి, ఆ పర్వత శిఖరంపై దివ్య లింగాకారంలో నువ్వు నివసించు తండ్రీ.." అని కోరుకున్నాడట.


దీనిపై మరింత చదవండి :