మల్లికార్జునుడి దివ్యక్షేత్రం శ్రీశైలం

Munibabu|
కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల మధ్య శ్రీ భ్రమరాంభికాదేవి సమేతంగా మహాశివుడు శ్రీమల్లిఖార్జునుని రూపమున వెలసిన దివ్యక్షేత్రం శ్రీశైలం. భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ శైవ క్షేత్రం నిత్యం శివనామ స్మరణతో మార్మోగుతుంటుంది.

కొండల ప్రాంతంలో పచ్చటి అరణ్యం మధ్య కొలువైన ఈ క్షేత్రానికి చరిత్ర ప్రధాన్యము కలదు. పురాణ పురుషులైన పాండవులు, శ్రీరాముడు లాంటివారు శ్రీశైల మల్లిఖార్జునుడిని సేవించారని పురాణాలు పేర్కొంటున్నాయి. కీకారణ్యము మధ్యలో ఆనాడు రాజులు నిర్మించిన ఈ దేవాలయం ఈనాటికి చెక్కుచెదరక నిలవడం విశేషం.

నాలుగువైపులా ఉన్న అతిపెద్ద గాలిగోపురాలు, నాలుగువైపులా బ్రహ్మండమైన ద్వారాలు ఈ దేవాలయానికి అత్యంత శోభను చేకూర్చిపెట్టాయి. సువిశాలమైన నల్లమల కొండల్లో వెలసిన ఈ శైవక్షేత్రంలో చూచిన కొద్దీ తనివితీరని మరెన్నో విశిష్ట దర్శనీయ స్థలాలు ఉన్నాయి.

దేవాలయ విశేషాలు
శ్రీశైల క్షేత్రాన్ని దర్శించే భక్తులకు మల్లిఖార్జుని సన్నిధితో పాటు మరెన్నో విశేషాల కనువిందు చేస్తాయి. మల్లిఖార్జుని గర్భగుడి మాత్రం సాధారణమైన కట్టడంగా గోచరించినా ప్రధాన అలయానికి పక్కనే ఉన్న భ్రమరాంభికా దేవి ఆలయం అద్భుతమైన శిల్పకళతో భక్తులను ఆకట్టుకుంటుంది.

అమ్మవారి దేవాలయం వెనుకభాగాన ఉన్న గోడకు చెవిపెట్టి వింటే భ్రమరనాధం వినిపించడం విశేషం. స్వామివారి, అమ్మవారి దివ్వసన్నిధితో పాటు స్వచ్ఛమైన నీటిని కలిగిన మనోహర గుండము సైతం వీక్షించదగ్గదే. వీటి తర్వాత దేవాలయ ప్రాంగణములో గల పాండవుల దేవాలయాలు, మండపాలు చూడదగ్గ విశేషాలు.
దీనిపై మరింత చదవండి :