లక్ష్మీ నరసింహుడు కొలువైన అంతర్వేది క్షేత్రం

Munibabu| Last Modified సోమవారం, 4 ఆగస్టు 2008 (13:48 IST)
వశిష్ట మహాముని కోరిక మేరకు లక్ష్మీ నరసింహునిగా మహా విష్ణువు కొలువైన దివ్య క్షేత్రమే అంతర్వేది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ఓ చిన్న గ్రామమైన అంతర్వేది కోస్తా ప్రాతంలో ఓ ప్రముఖ క్షేత్రంగా విలసిల్లుతోంది. క్రీస్తు పూర్వంకు చెందిన ఆలయంగా పేరు సంపాధించుకున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహుని ఆలయం ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉండడం విశేషం.

అంతర్వేది క్షేత్ర పురాణం
పురాణ కాలంలో హిరాణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనుడనే రాక్షసుడు బ్రహ్మర్షులు, మహా తపశక్తి సంపన్నులైన ముని పుంగవులను బాధిస్తూ ఆనందిస్తుండేవాడు. శివుడిచ్చిన వరం చేత ఆ రాక్షసుని ఎదిరించేందుకు ఎవరి వల్లా అయ్యేది కాదు. రక్తావలోచనుడి శరీరం నుంచి కారే రక్తం క్రింద పడితే ఆ రక్తం వల్ల తడిసిన ఒక్కో ఇసుక రేణువు ఒక్కో శక్తివంతమైన రాక్షసునిగా ఉద్భవించేది. ఇలాంటి వరం ఉండడం చేతనే రక్తావలోచనుడు ముల్లోకాలను గడగడలాడించేవాడు.

అలాంటి రక్తావలోచనుడు ఓసారి రాక్షస గురువైన విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు వశిష్ట మహా మునిని హింసించడం ప్రారంభిస్తాడు. ఇందులో భాగంగా వశిష్టుని నూరుగురు కుమారుల్ని రక్తావలోచనుడు సంహరిస్తాడు. రక్తావలోచనుడి ఆగడాలు భరించలేని వశిష్టుడు చివరకు మహా విష్ణువును ప్రార్ధిస్తాడు. వశిష్టుని ప్రార్ధనను మన్నించి మహావిష్ణువు రక్తావలోచనుడిని సంహరించేందుకు బయలు దేరుతాడు.

అయితే రక్తావలోచనుడికి ఉన్న బలం తెలిసిన మహావిష్ణవు అతని సంహరించిన సమయంలో అతని రక్తం నేలపై పడకుండా ఓ నదిలా పారే ఏర్పాటు చేసి అనంతరం రక్తావలోచునిడి తలను తన సుదర్శన చక్రంచే ఛేదిస్తాడు. (అలా ఆనాడు విష్ణువుచే ఏర్పరచబడిన నదే రక్తకుల్య పేరుతో నేటికీ ఈ ప్రాంతంలో భక్తులచే పూజలందుకుంటోంది) దీంతో రక్తావలోచనుడి పీడ విరగడవుతుంది.

తన కోరిక మేరకు రక్తావలోచనుడిని సంహరించిన విష్ణువుని చూచి వశిస్టుడు మరో కోరిక కోరుతాడు. వశిష్టుడి కోరిక మేరకు విష్ణువు లక్ష్మీ నరసింహుని అవతారంలో అంతర్వేదీ ప్రాంతంలో కొలువైనాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ అంతర్వేదీ స్థలానికి ఆ పేరు రావడానికి సంబంధించి మరో కథ చెప్పబడుతుంటుంది.
దీనిపై మరింత చదవండి :