వడోదర కాశీ విశ్వనాథుని దర్శించుకుందాం... రండి!!

Hanumantha Reddy|
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా ఈసారి మిమ్మల్ని గుజరాత్‌లోని కాశీ విశ్వనాథ ఆలయానికి తీసుకువెళుతున్నాం. ఈ చారిత్రక ఆలయాన్ని 120 ఏళ్ల కిందట సయాజీరావు గైక్వాడ్ పాలనా కాలంలో నిర్మించినట్లు చెపుతారు.

గైక్వాడ్ తదనంతరం ఆలయాన్ని స్వామి వల్లభరావుకి అప్పగించినట్లు చెపుతారు. ఆ తర్వాత స్వామి చిదానంద్ సరస్వతి అధీనంలోకి వచ్చింది. చిదానంద్ 1948లో ఆలయానికి పునరుద్ధరణ పనులు చేపట్టారు. చిదానంద్ సరస్వతి మరణానంతరం ఆలయాన్ని ట్రస్ట్‌కు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి నేటికీ ఆలయ నిర్వహణను ట్రస్ట్ చూసుకుంటోంది.

కాశీ విశ్వనాథుని ఆలయం గైక్వాడ్ ప్యాలెస్‌కు ఎదురుగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం చాలా పెద్దదిగానూ అందంగానూ ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద నల్లరాతితో మలచబడ్డ నందీశ్వరుని విగ్రహం ఉంటుంది.

నందీశ్వరునితోపాటు అక్కడ ఓ తాబేలు విగ్రహం కూడా గోచరిస్తుంది. ఈ తాబేలును అదృష్టానికి ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు. ఇక నందీశ్వరని విగ్రహానికి ఆవల స్వామీ వల్లభ రావు, స్వామీ చిదానంద విగ్రహాలు కనబడతాయి.

ఈ ఆలయాన్ని రెండు భాగాలుగా నిర్మించారు. మొదటి భాగం విశాలమైన హాలులా ఉంటుంది. ఇక్కడ భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. రెండో భాగంలో స్వామివారు వేంచేసిన గర్భగుడి ఉంది. దీనిని తెల్లరాతితో నిర్మించారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన పిల్లర్లపై ఆయా దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ గోపురం కనువిందుగా ఉంటుంది.

గర్భగుడిలో శివలింగం వెండి తాపడం చేసి అత్యంత రమణీయంగా కనిపిస్తుంటుంది. ఈ శివలింగాన్ని తాకేందుకు భక్తులను అనుమతించరు. స్వామివారికి పాలు, నీళ్లను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.


దీనిపై మరింత చదవండి :