విశాలాక్షి కొలువైన క్షేత్రం వారణాసి

Munibabu| Last Modified శనివారం, 19 జులై 2008 (12:25 IST)
హిందువులకు పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో వారణాసి (కాశీ)క్షేత్రం ప్రముఖమైనది. పురాణ కాలంనుంచి విశేష ప్రాచూర్యం ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించి ప్రాచూర్యంలో ఉన్న కథనాలు అన్నీ ఇన్నీ కావు. హిందూ పురాణాల ప్రకారం శివుని త్రిశూలం మీద నిలిచిన పుణ్య ప్రదేశంగా కాశీ క్షేత్రాన్ని పేర్కొంటారు.

లయకారుడైన శివుని అధీనంలో ఉన్న ఈ క్షేత్రం బ్రహ్మ సృష్టి కాదని పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే ప్రళయకాళమునందు కూడా ఈ కాశీ క్షేత్రం నాశనం కాదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వరుణ, అసి నదుల ప్రవాహంతో వారణాసిగా ప్రాచూర్యం పొందిన కాశీ క్షేత్రంలో పార్వతీ అమ్మవారు విశాలాక్షి రూపంలో వెలసియున్నారు.

అలాగే పరమ శివుడు జ్యోతిర్లింగ రూపంలో విశ్వేశ్వరుడై కొలువు తీరి ఉన్నాడు. హిందువులు పరమ పవిత్రంగా భావించే ఈ కాశీ క్షేత్రాన్ని జీవితంలో ఓసారైనా దర్శించాలని కోరుకుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలసిన ఈ దివ్యక్షేత్రం గంగానది తీరాన వెలసియున్నది.

ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కాగా ఈ కాశీలో వెలసిన అమ్మవారి క్షేత్రం జిల్లా కేంద్రం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మణికర్ణికా ఘాట్‌ వద్ద ఉంది. ఈ ఘాట్‌ వద్దనే ఎల్లప్పుడూ శవ దహనాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఘాట్‌లో స్నానమాచరించిన తర్వాతే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ.

కాశీ క్షేత్రం అనేక దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రవహించే గంగానదీ తీరంలో దాదాపు 64 స్నాన ఘట్టాలు గలవు. భక్తులు అనునిత్యం ఈ స్నాన ఘట్టాల్లో భక్తి ప్రవుతులతో స్నానమాచరిస్తూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో మఠాలకు కూడా కొదవలేదు. హిందూమతాన్ని ఆచరించే వివిధ వర్గాల ప్రజలంతా ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు.


దీనిపై మరింత చదవండి :