మానవ జీవితానికి తీర్థయాత్రలు పుణ్యఫలాలను అందిస్తాయని విశ్వాసం. భగవంతుని కటాక్షం ఉంటేనే దేవాలయాలకు భక్తులు వెళ్లగలుగుతారు. ఇలా ఆలయాలకు వెళ్లి ఆ దేవతలను దర్శించుకుంటే వారి అభయం ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. కార్తీకమాసంలో పూజలతోపాటు తీర్థయాత్రలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులుంటాయని చెప్పబడింది. అయితే ఇవేవీ పెద్దగా తెలీనివారు ఆ విషయాలను తెలుసుకున్నా, చదివినా సగలాభం పొందుతారని అధర్వణ వేదంలో చెప్పబడింది. అటువంటి పుణ్యప్రదమైన తీర్థయాత్రను నేను ఈ కార్తీకమాసంలో చేయడం జరిగింది. జమ్మూ - కాశ్మీర్ ప్రాంతంలో వెలసిన వైష్ణవిమాత దర్శనభాగ్యంకోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నాకు ఈ కార్తీకంలో ఆ అవకాశం కలిగింది. దేశంలో శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుపతి తర్వాత స్థానంగా చెప్పబడే వైష్ణవి మాత ఆశీస్సులకై నేను సాగించిన యాత్ర వివరాలు మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బహుశాః ఈ అవకాశాన్ని కూడా ఆ మాతే కల్పించి ఉంటుంది అని నమ్ముతున్నాను.