శనీశ్వరుని దివ్య సన్నిధి శనిశింగణాపూర్

Munibabu| Last Modified గురువారం, 20 నవంబరు 2008 (00:16 IST)
దైవ భక్తి ప్రాతిపాదికన హిందువులకు ఉన్న నమ్మకాలు అన్నీ ఇన్నీ కావు. లేక్కలేనన్ని దేవుళ్లను పూజించే హిందువులు ఆ దేవుళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శక్తి ఉందని ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే హిందువులు ఒక్కో దేవున్నీ పూజించే విధానంలో ఎన్నో వ్యత్యాసాలు మనకు స్పష్టంగా గోచరిస్తాయి.

మనకున్న తొమ్మిది గ్రహాలను దేవుళ్లుగా నమ్మి కొలవడం హిందూ సాంప్రదాయంలో ఉన్నదే. అయితే ఈ గ్రహాల్లో శని గ్రహానికి ఓ విశిష్టత ఉంది. అందరి దేవుళ్ల చూపు తమపై ఉండాలని పూజించే భక్తులు శనీశ్వరుని చూపు తమపై ఉండకూడదని గాఢంగా కోరుకుంటారు. శనీశ్వరునికి కోపం వచ్చి మన జీవితంపై ప్రభావం చూపిస్తే ఇక లోకంలోని కష్టాలన్నీ తమకే కల్గుతాయని నమ్మడం వల్లే హిందువులు ఈ విధంగా భావిస్తారు.

అందుకే తమపై శని ప్రభావం పడరాదని కోరుకుంటూ ఆ శనీశ్వరుని ప్రార్థిస్తారు. ఈ కారణంగానే భయపడే దేవుడైనాకూడా శనీశ్వరునికి సైతం అక్కడక్కడా దేవాలయాలు నిర్మించి విశేషమైన పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా శనీశ్వరునికోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆలయాలు భారతదేశం మొత్తం మీద కొన్ని మాత్రమే ఉన్నాయి.

అలా శనీశ్వరుని పేరుమీద ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శనిశింగణాపూర్ కూడా ఒకటి. శనిశింగణాపూర్‌లో కొలువైన శనీశ్వరుని నిష్టగా పూజిస్తే ఆయన కల్గించే చెడు ప్రభావమేదీ మనపై పడకుండా కేవలం ఆయన ఆశీస్సులు మాత్రమే మనకు కల్గుతాయని భక్తుల విశ్వాసం.

శనిశింగణాపూర్ విశేషాలు
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా నెవాసా తాలుకాకు చెందిన ఓ సుందరగ్రామమే ఈ శనిశింగణాపూర్. చూచేందుకు ఓ చిన్న గ్రామంగా ఉన్నా శనిశింగణాపూర్‌కు ఎన్నో విశిష్టతలున్నాయి. ఓ ఆదర్శగ్రామంగా పేరు తెచ్చుకున్న ఈ గ్రామం కేవలం శనీశ్వరుని ఆలయం వల్లే కాకుండా ఆచార వ్యవహారాలు, గ్రామ కట్టుబాట్ల విషయంలో అందరికీ ఆదర్శంగా ఉండడం విశేషం.

దాదాపు 3000 వరకు జనాభా కల్గిన ఈ గ్రామంలో ఉండే దాదాపు 450 గృహాలలో ఏ ఇంటికీ తలుపులు ఉండకపోవడం విశేషం. ఈ గ్రామంలో కొలువైన శనీశ్వరుడు తమను నిత్యం వెన్నంటి కాపాడుతుంటాడని... అలాంటపుడు గృహాలకు తలుపులు బిగించుకోవాల్సిన అవసరం ఏముంది అన్నది ఈ ఊరివారి ప్రశ్న. వీరి మాటలు నిజమే అన్నట్టు ఈ ఉరిలో ప్రస్తుతం కట్టబడే గృహాలకు సైతం తలుపులు బిగించకపోవడం గమనార్హం.

ఈ విషయం వల్లే ఈ ఊరు గిన్నీస్‌బుక్‌లో కూడా స్థానం సంపాధించింది. దొంగతనం అన్న ఊసే ఎరగని ఈ ఊరిలో పోలీస్‌స్టేషన్ కూడా లేదు. అలాగే ఊరికి సంబంధించి ఏదైనా వివాదం ఎదురైనా ఊరి పెద్దలే దానిని పరిష్కరించడం మరో విశేషం. ఇలాంటి అద్భుతమైన అంశాలు కల్గిన ఊరిలో వెలిసిన శనీశ్వరునికి సైతం ఎలాంటి ఆలయం లేకపోవడం మరో విశేషం.
దీనిపై మరింత చదవండి :