సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం

FILE

సీతారాముల దాసుడిగా, రామ భక్తుడిగా, విజయ ప్రదాతగా, రక్షకుడిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయుడు. ఈయన్నే హనుమాన్, భజరంగబలి వంటి ఎన్నో రకాల పేర్లతో ఆరాధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో హనుమంతుని ఆలయంలేని ఊరు అరుదుగా ఉంటుందంటే, అతిశయోక్తి కాదు.

కార్యసాధకులయిన వారికి కృషి, పట్టుదల, ధైర్యసాహసాలు, అచంచలమైన ఆత్మవిశ్వాసం, ఇంద్రియ నిగ్రహం, బుద్ధిబలం, తెగింపు, చొరవ మాటకారితనం ఉంటే అది ఎంతటి కష్టమైన పని అయినా తప్పకుండా నెరవేరుతుందని మనసా, వాచా, కర్మణా నమ్మి నిరూపించినవాడు హనుమంతుడు. ఈ స్వామి జయంతి సందర్భంగా (మే 19న) మనం ఈరోజు "సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయ" ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం.

నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్టకు సమీపంలో గల ఈ సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం తప్పక దర్శించదగిన క్షేత్రం. కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనుకనుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది.

ప్రపంచంలో మొదటిసారిగా నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధి దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా తొమ్మిది ఆలయాలను ఇక్కడ నిర్మించారు. పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వరస్వామి ఈ దేవాలయంలో కొలువుతీరి ఉన్నారు. దేవాలయంలోపల హుండీలను చాలా కళాత్మకంగా కలశాలను పోలినట్లుగా తీర్చిదిద్దారు.

ఈ హుండీలలో ఒక కలశం మీద అష్టలక్ష్మీదేవిలను చెక్కితే... మరో కలశంమీద, వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి బొమ్మలను చెక్కారు. ఈ ఆలయంలో పుట్టమన్నుతో చేసిన శివలింగాలను అర్చించినట్లయితే గ్రహదోశాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. వేపచెట్టు లక్ష్మీస్వరూపం, రావి చెట్టు విష్ణు స్వరూపం కనుక ఈ రెండు వృక్షాలకు హనుమదీశ్వర ఆలయంలో పూజాది కార్యక్రమాలు... వేప, రావి చెట్లకు వివాహం చేస్తుంటారు.

ఆంజనేయస్వామిని కొలిచిన వారికి మానసిక దౌర్భల్యం నశించి, మనోధైర్యం సిద్ధిస్తుంది. బుద్ధి, బలం, శక్తి, యశస్సు, ఆయురారోగ్యాలు చేకూరతాయి. వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. అవివాహితులకు కళ్యాణం ప్రాప్తి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం.

సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లో చూడదగ్గది కళాధామం. ఈ ప్రదేశాన్ని చూడాల్సిందేగానీ, చెప్పేందుకు అలవికానట్టిది. కళాధామం దర్శించేందుకు వంద రూపాయల ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఈ ప్రదేశాన్నంతా కలియదిరిగేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది.

అమ్మవారి వాహనం సింహం నోటినుండి కళాధామానికి ఏర్పాటు చేసిన ప్రవేశమార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నప్రధాన దేవాలయాల మినీ రూపాలు ఉన్నాయి. వీటిలో విజయవాడ కనకదుర్గ ఆలయం, షిర్డి సాయిబాబా గుడి , తిరుమల వెంకటేశ్వర ఆలయం చెప్పుకోదగ్గవి.

Ganesh|
రవాణా సౌకర్యాల విషయానికి వస్తే... రాయ్‌గిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుంచి చాలా బస్సులు కలవు. వసతి సదుపాయాలు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం వారి ఆధ్వర్యంలో లభిస్తాయి.


దీనిపై మరింత చదవండి :