సోదర భావానికి ప్రతీక "ఖాదిగుల్షన్ షరీఫ్ దర్గా"

allah
Ganesh|
FILE
హిందూ, ముస్లిం మత సామరస్యానికి, సోదర భావానికి ప్రతీకగా... సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగినది "ఖాదిగుల్షన్ షరీఫ్ దర్గా". ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లా, రామగుండం మండలం, అల్లూరు గ్రామంలో ఉన్న ఈ మహిమాన్వితమైన దర్గాను సందర్శించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉరుసు ఉత్సవానికి వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

స్థానిక ముస్లిం మత గురువుల కథనం ప్రకారం... "ఖాదిగుల్షన్ షరీఫ్ దర్గా" సుమారు 300 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. మహిమాన్వితులైన ముస్లిం మత గురువు ఇక్కడ సమాధి అయ్యారనీ.. వీరు సమాధిలోంచి భక్తులను దీవిస్తూ, వారి కోరికలు నెరవేరుస్తుంటారని స్థానికులు చెబుతుంటారు.

మధ్యప్రదేశ్‌లో గల అజ్మీర్ దర్గాకు చెందిన సయ్యద్ ఖాజా కమ్లివాలే బాబా ర్జవి చిస్టి ఉల్ ఖాద్రి అనే మత గురువు అల్లూరు ప్రాంతానికి వలస వచ్చి, ఇక్కడి ప్రజలను కాపాడేందుకుగానూ సమాధి అయ్యారని కథనం. ఆ తరువాత సయ్యద్ మోయిజొద్దీన్ హుస్సేనీ రజ్వి చిస్టి ఉల్ ఖాద్రియమని, సయ్యద్ జునేదలి హుస్సేన్ రజ్వి చిస్టి ఉల్ ఖాద్రి, సయ్యద్ గులామ్ అలి హుస్సేని రజ్వి చిస్టి ఉల్‌ఖాద్రీ అనే పేరుగల ముగ్గురు శిష్యులు కూడా ఇక్కడే సమాధి అయ్యారని నమ్ముతుంటారు. ఇలా ఈ నలుగురి సమాధులు నేడు షరీఫ్ దర్గాలో భక్తులను దీవిస్తున్నట్లు కూడా చెబుతుంటారు.

ఈ షరీఫ్ దర్గాను సందర్శించిన భక్తులను, వారి బాధలను, ఆరోగ్య సమస్యలను, భూత ప్రేత గ్రహ బాధలను వీరు సమాధి నుండే తొలగించి... రక్షిస్తారని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆరోగ్య సమస్యలు, పిచ్చిపట్టినవారు, మానసిక ప్రశాంతత లేనివారు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నట్లయితే మంచివారుగా మారుతారు. ఇక్కడి అతి పురాతన భారీ రావి వృక్షం... ఈ దర్గాకు 300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది అనేందుకు నిదర్శనంగా నిలిచి ఉంటుంది.

ఒకప్పుడు అల్లూరు ప్రాంతంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండేవారు. ఈ గ్రామంలో సుమారు 5వేల ఎకరాల మేర జమీనులు కల్గిన జమిందారులు ఉండేవారు. ఇక్కడ పూర్వకాలం నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న "ఉరుసు" ఉత్సవంలో.. ముస్లింలతో పాటు హిందువులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇప్పుడైతే హిందువులు అతి ఎక్కువ సంఖ్యలో గ్రామంలో ఉండడం మూలంగా వారు ఈ ఉత్సవంలో పాల్గొనడం సాంప్రదాయంగా కూడా మారింది.


దీనిపై మరింత చదవండి :